రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణ విధానం వెనక ఆంతర్యం, శాస్త్రీయత ఏమిటో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరీక్షలు, వైద్యులకు రక్షణ కిట్లు తదితర అంశాలపై విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.
ఎందుకు మరణించారో ఎలా తెలుస్తుంది
కంటైన్ మెంట్ ప్రాంతాల్లో ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయడం లేదని.. దానివల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. కంటైన్మెంట్లలో ఎంత మంది ప్రజలు ఉంటారని.. అడ్వకేట్ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. మృతదేహాల నుంచి రక్తనమూనాలను సేకరించిన కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. పరీక్షలు చేయకపోతే ఎందుకు మరణించారో ఎలా తెలుస్తుందని నిలదీసింది. ఒకవేళ కరోనాతో చనిపోతే వారెవరిని కలిశారో గుర్తించాలి కదా అని పేర్కొంది.
శాస్త్రీయ ఆధారాలేంటీ..?
లక్షణాలు ఉన్న వారికే కరోనా పరీక్షలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వెనక కారణమేంటి.. దానికి శాస్త్రీయ ఆధారాలేంటని ప్రశ్నించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల్లో ఎక్కడ ఉందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తమకు తాము మోసం చేయకుండా వాస్తవిక దృష్టితో చూడాలని.. లేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.
గణాంకాలతో గజిబిజి
వీలైనంత ఎక్కువ మంది కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తిస్థాయి పరీక్షలు చేయకుండా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై వాస్తవాలు ఎలా తెలుస్తాయని.. గణాంకాలతో గజిబిజి చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.