Heavy Rains In Telangana: తెలంగాణలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. ప్రజలంతా ఐదురోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంటుందని శుక్రవారం ఆ శాఖ ప్రకటించింది. ఇంకా 4 రోజులు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఈక్రమంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిదన్నారు. మరోవైపు రాష్ట్రంలో వానలు విజృంభించడంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. భద్రాద్రి జిల్లాలో ఒక మహిళ పిడుగుపాటుకు గురై మరణించారు. వైరా నదిలో ఒకరు గల్లంతయ్యారు. పలువురు కూలీలు వరదల్లో చిక్కుకున్నారు. స్కూలు బస్సు వరదనీటిలో చిక్కుకుంది.
హైదరాబాద్‌లో సుమారు 2 వేల కాలనీలు నీట మునిగాయని జీహెచ్‌ఎంసీ అంచనా వేసింది. ఎల్బీనగర్ నుంచి శేరిలింగంపల్లి వరకు రహదారులు చెరువులను తలపించాయి. నిజాంపేట, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది. నిజాంపేట బండారి లేఅవుట్, బృందావన్‌కాలనీ, బాలాజీనగర్, శ్రీనివాసకాలనీ, బాచుపల్లి, రాజీవ్‌గాంధీనగర్, జయదీపికా ఎస్టేట్ తదితర ప్రాంతాల్లో నాలాలు లేకపోవడంతో రోడ్లపై నడుము లోతున వరద నీరు నిలిచింది. పాఠశాల బస్సులు, కార్లు ఆగిపోయాయి. చార్మినార్ చుట్టూ ఉన్న రోడ్లు మునిగాయి. కూకట్‌పల్లి, మూసాపేట, జీడిమెట్ల, బాలానగర్ ప్రాంతాల్లో నాలాకు వరద పోటెత్తింది. బేగంపేట ప్రాంతంలో నాలా పొంగడంతో పలు కాలనీలు నీట మునిగాయి. హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకుందని ఇంజినీర్లు తెలిపారు. హైదరాబాద్ నగర శివారు బాచుపల్లిలో 11.8 సెం.మీ.లు కురిసింది. బాటసింగారం పండ్ల మార్కెట్‌లో వర్షానికి పండ్లన్నీ వరదలో కొట్టుకుపోయాయి.
జిల్లాల్లో..
సూర్యాపేటతో పాటు నూతనకల్, నడిగూడెం, పెన్‌పహడ్, హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల్లో భారీగా కురవగా.. నల్గొండ, డిండి, దేవరకొండ, మిర్యాలగూడల్లో ఓ మోస్తరు వర్షం పడింది. మోతె మండలంలోని పలు ప్రాంతాల్లో పత్తి పంట నీటమునిగింది. మూసీ ప్రాజెక్టుకు సుమారు 2 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరింది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంతో పాటు భువనగిరి, రామన్నపేట, గుండాల ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో వరి పొలాలు, పత్తి చేలు నీట మునిగాయి. ములుగు జిల్లాలో తాడ్వాయి-పస్రా మధ్య 163వ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జలగలాంచ వాగు ఉప్పొంగి జాతీయరహదారి మీదుగా ప్రవహిస్తోంది. శుక్రవారం రాత్రి ఏటూరునాగారంలో వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాన్వాయ్ ప్రవాహం వద్ద నిలిచిపోయింది. దీంతో నార్లాపురం, మేడారం మీదుగా తాడ్వాయికి చేరుకొని ఏటూరునాగారం మీదుగా మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి వెళ్లారు.
ఎందుకీ అతి భారీ వర్షాలు
మరోవైపు శుక్రవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 10 గంటలవరకు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఏకంగా 21 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇలా 24 ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ.ల వర్షం ఏకధారగా పడటం గమనార్హం. శుక్రవారం రాత్రి కుండపోతగా కురుస్తూనే ఉంది. ఒడిశా ఉత్తర ప్రాంతంపై భూమి నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ద్రోణి ఉంది. ఇది నైరుతి భారతంవైపు వంపు తిరిగింది. మరోవైపు ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య గాలులతో మరో ఉపరితల ద్రోణి కర్ణాటక నుంచి శ్రీలంక సమీపంలోని కొమరీన్ ప్రాంతం వరకూ 900 మీటర్ల ఎత్తున వ్యాపించింది. వీటినుంచి దక్షిణ తెలంగాణపై తక్కువ ఎత్తులో గాలుల్లో అస్థిరత ఏర్పడింది. ఇది సిద్దిపేట, హైదరాబాద్‌లపై ఉండటంతో కుంభవృష్టి కురుస్తోందని నాగరత్న వివరించారు. అనూహ్య మార్పులు వచ్చినందున శుక్రవారం అతిభారీ వర్షాలు కురిశాయని, ఇలాంటి సంకేతాలు 24 గంటల ముందు అంటే గురువారం లేకపోవడం వల్లనే హెచ్చరికలు ఇవ్వలేదన్నారు.
వరదలో చిక్కుకున్న కూలీలు
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం- మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రాంపురం మధ్యలో బొత్తలపాలెం చుట్టూ పాలేరు వాగు ఒడ్డున 25 మంది కూలీలు ఉండిపోయారు. చుట్టూ నీరు ఉండటంతో వారు రావడానికి అవకాశం లేకపోయింది.
* జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చీటూరుకు చెందిన మహిళా కూలీలు రెండు వాగుల మధ్య చిక్కుకు పోయారు. చీటూరులోని 10 మంది కూలీలు నాట్లు వేసేందుకు చీటూరు వాగు, గోపువాగు దాటి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గోపువాగు దాటారు. చీటూరు వాగు ఉద్ధృతి పెరగడంతో రఘునాథపల్లి మండలం కన్నాయపల్లి గ్రామంలో ఉండేందుకు వెనుదిరిగారు. ఈలోగా గోపు వాగు కూడా పెరిగింది. ఇంకా గొర్రెల కాపరి నోముల శ్రీశైలం, ముగ్గురు రైతులు చిక్కుకున్నారు.
పిడుగుపాటుకు మహిళ బలి
భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పెద్దతండాలో పిడుగుపాటుకు గురై లావుడ్య కవిత (28) మృతి చెందారు. ఖమ్మం జిల్లా వైరా ఫిషరీస్ కాలనీకి చెందిన పాలేటి గోపీకృష్ణ(16) పశువుల కాసేందుకు తండ్రి వెంకటేశ్వరరావుతో కలిసి వెళ్లి వైరానదిలో గల్లంతయ్యాడు.
వరదలో పాఠశాల బస్సు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామశివారులోని కొత్తచెరువు వరదలో ప్రైవేటు పాఠశాల బస్సు వరద నీటిలో చిక్కుకుంది. సాయంత్రం తొర్రూరు నుంచి నర్సింహులపేటకు 25 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో వస్తున్న బస్సు ఇంజిన్‌లోకి నీరు ప్రవేశించి నిలిచిపోయింది. గ్రామస్థులు వెంటనే బస్‌లోని విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు.
ఇదీ చదవండి: ఉప్పొంగుతున్న వాగు.. చిక్కుకుపోయిన 23 మంది కూలీలు