రాష్ట్ర రాజధానిలో వాతావరణ చల్లబడి... ఉరుములు మెరుపులతో కూడిన వర్షం విరుచుకుపడింది. భారీ వానతో రోడ్లన్ని జలమయమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.
అల్వాల్, బొల్లారం, బేగంపేట, మారేడ్పల్లి, ప్యాట్నీ, చిలకలగూడా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. కాలనీల్లో చీకటి అలుముకుంది. బేగంపేట, ప్యారడైజ్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. ఎస్సార్ నగర్ జయశంకర్ నగర్లో విద్యుదాఘాతంతో 18 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.
చాదర్‌ఘాట్, సరూర్‌నగర్, సైదాబాద్, చంపాపేట్ సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శేరిలింగంపల్లిలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.
రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఆదర్శ నగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్లు విరిగిపడి రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు ధ్వంసమయ్యాయి. కరెంట్ స్తంభాలు కూలి విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. మల్లికార్జున నగర్ కాలనీలో తాడి చెట్టు కూలి ఓ ఇళ్లు ధ్వసం అయింది. వనస్థలీపురంలో చెట్టు కూలి రెండు కార్లు ధ్వంసమయ్యాయి.
ఇదీ చూడండి: కాలు తీసిన కార్పొరేట్.. నిర్లక్ష్యానికి పరాకాష్ఠ..