Harish Rao On Organ Donation: ఆరోగ్య తెలంగాణ అంటే రోగాలు వచ్చాక చికిత్స అందించటం కాకుండా ప్రజలు అనారోగ్యంపాలు కాకుండా చర్యలు తీసుకోవటమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జాతీయ అవయవ దినోత్సవం సందర్భంగా 162 అవయవదాతల కుటుంబాలను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో హరీశ్ రావు సత్కరించారు. త్వరలో గాంధీ ఆస్పత్రిలో 35కోట్లతో ప్రత్యేక అవయవమార్పిడి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఒక మనిషి చనిపోయినా అతను అతని అవయవాల దానంతో 8మంది ప్రాణాలను నిలపవచ్చని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అవయవదానంలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణ పేరుతో ఆయుష్ ద్వారా ముందస్తు చర్యలు చేపడతామని చెప్పారు. అవయవ దానం తరహాలో ఆరోగ్య పరిరక్షణ సైతం దేశానికే దిక్సూచిగా మారతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవయవదానంలో చాలా రాష్ట్రాలు తెలంగాణ విధానాలనే అమలు చేస్తున్నాయని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
అవయవ మార్పిడి సమయంలో ఎదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే హెలికాప్టర్ సైతం వినియోగిస్తామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సాధారణంగా అవయవాలు బీపీ,షుగర్ వల్లే అధికంగా చెడిపోతాయని.. జీవనశైలి మార్చుకోవడం వల్ల అవయవాలు ఫెయిల్కావటాన్ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. యువకులు సైతం వారి కుటుంబాలలో అవయవదానాలపై అవగాహాన కల్పించాలని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.
"ఒక ఆత్మీయుడిని కోల్పోతూ కూడా మీరు 8మందికి ప్రాణదానం చేయడానికి మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. మీరు చేసిన అవయవదానం ద్వారా.. వారు మన మధ్యనే బతికే ఉన్నారు. ఒక్కొక్క శరీరం నుంచి 8 రకాల అవయవదానాలు జరుగుతాయి. ఆ అవయవదానాలను పొందిన వారు మన మధ్యనే జీవించి ఉన్నారు.". - హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇవీ చదవండి: