గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. జులై 18న ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చీఫ్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. పరీక్షకు వారం ముందు గురుకుల సొసైటీల వెబ్సైట్ల నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. మే 30న ప్రవేశ పరీక్ష జరపాలని భావించినప్పటికీ.. కరోనా తీవ్రత కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదో తరగతి టీజీ సెట్ రాసేందుకు అర్హులు.
ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లోని 46 వేల 937 ఐదో తరగతి సీట్లను భర్తీ చేస్తారు. ఎస్సీ గురుకులాల్లో 18,560, గిరిజన గురుకులాల్లో 4,777, బీసీ గురుకులాల్లో 20,800, జనరల్ గురుకులాల్లో 2,800 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివరాలను గురుకులాల వెబ్సైట్లు లేదా 1800 425 45678 టోల్ ఫ్రీ నెంబరు ద్వారా తెలుసుకోవచ్చునని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: Cm Kcr On Professor: వాసాలమర్రిలో బంగ్లాదేశ్ ప్రొఫెసర్ ప్రస్తావన