ప్రభుత్వ భూముల అమ్మకం కసరత్తు వేగవంతమవుతోంది. విక్రయించే భూముల వివరాలను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం... వాటి అమ్మకం కోసం మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ-వేలం ద్వారా పారదర్శక విధానంలో... ఆయా నోడల్ శాఖలు, ఏజెన్సీల ద్వారా భూములను విక్రయించనున్నారు. కొనుగోలుదార్లకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు, అనుమతులకు ఇబ్బందులు లేకుండా నిర్దిష్ట విధానాలను ఖరారు చేసింది. బహుళ వినియోగానికి వీలుగా భూములను అవసరమైన జోనింగ్లో చేర్చడంతో పాటు టీఎస్ బీపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విక్రయించేందుకు రంగం సిద్ధం
నిధుల సమీకరణ కోసం భూములను విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం... అందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న, భూములను ఈ-వేలం ద్వారా పారదర్శక విధానంలో విక్రయించాలని నిర్ణయించారు. అమ్మకం కోసం మార్గదర్శకాలు ఖరారు చేసిన ప్రభుత్వం... నోడల్ శాఖలు అనుసరించాల్సిన నిర్ధిష్ట నిర్వహణా విధానాన్ని ప్రకటించింది.
సింగిల్ విండో విధానం
విక్రయించే భూములకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేకుండా, అనుమతులకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మార్గదర్శకాలు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఆ భూములను బహుళార్ధకంగా ఉపయోగించుకునేందుకు వీలుగా... తగిన జోనింగ్ కింద ప్రకటించాలని స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నుంచి అవసరమైన అనుమతులను నిర్ధిష్ట గడువులోగా ఇవ్వాలని, అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్లో పొందుపర్చాలని తెలిపింది. అవసరమైన అనుమతులన్నింటినీ టీఎస్ బీపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఈ-వేలం ద్వారా..
ప్రభుత్వం ప్రకటించే నోడల్ శాఖ ఈ-వేలానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీసీ ఆన్లైన్ ప్లాట్ ఫాం ద్వారా ఈ-వేలాన్ని నిర్వహిస్తారు. భూముల కనీస ధరను నిర్ణయించడం, ఈ-వేలం షెడ్యూల్ ప్రకటన, మార్కెటింగ్, కన్సల్టెంట్ల సేవలు వినియోగం, బిడ్ల ఆమోదం, తదితరాలను నోడల్ ఏజెన్సీ నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ-వేలం ద్వారా భూమిని పొందిన వారికి డబ్బులు చెల్లించిన ఏడు రోజుల్లోగా జిల్లా కలెక్టర్ భూమిని రిజిస్టర్ చేసి అప్పగించాల్సి ఉంటుంది.
పలు కమిటీలు ఏర్పాటు
భూముల అమ్మకం ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉంటుంది. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక, పురపాలక, ఐటీశాఖల ముఖ్యకార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
వివాదాలు లేకుండా
న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ ఏర్పాటైంది. న్యాయశాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ ప్రతినిధి, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఐజీ, సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అవసరమైన అన్ని అనుమతుల పర్యవేక్షణ కోసం అప్రూవల్ కమిటీని ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు, దక్షిణ డిస్కం, జలమండలి ఎండీలు, అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్, కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి ఈ కమిటీలో ఉంటారు.
ఉత్తర్వులు జారీ
అమ్మకం కోసం భూములను సిద్ధం చేయడం, సదుపాయాలు కల్పించడం, అవసరమైన మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేయడం లాంటి వాటి కోసం ఆక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ కమిషనర్, గృహనిర్మాణ సంస్థ ఎండీ, టీఎస్ఐఐసీ ఎండీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశ్రమల శాఖ తరఫున ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి: weather update: రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు వర్షాలు