వ్యవసాయ డిగ్రీ కోర్సు, సీట్లకు రాష్ట్రంలో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందుకు అనుగుణంగా ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఈ వర్సిటీ కింద ఉన్న 5 కళాశాలల్లో 120కి, వర్సిటీ క్యాంపస్ రాజేంద్రనగర్ కళాశాలలో 240కి సీట్లను పెంచింది. వీటితో ఈ విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో జయశంకర్ వర్సిటీ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 840కి పెరిగింది. గతంలో 650 సీట్లు ఉండేవి. ఇంటర్ (బైపీసీ) విద్యార్థుల ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా వీటిని భర్తీ చేస్తారు. వరంగల్, సిరిసిల్ల, పాలెం (నాగర్‌కర్నూల్ జిల్లా)లోని కాలేజీల్లో విద్యార్థుల వసతి గృహాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇవి పూర్తయితే వచ్చే విద్యాసంవత్సరం(2022-23) నుంచి మరికొన్ని సీట్లు పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
వచ్చే అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో వీటిని ఆమోదిస్తే సీట్ల పెంపుపై ఉత్తర్వులు వెలువడతాయి. వ్యవసాయ వర్సిటీ తరపున ప్రైవేటు కళాశాలలకు అనుమతి లేనందున ప్రభుత్వ కాలేజీల్లోని డిగ్రీ సీట్లకు తీవ్ర పోటీ ఉంటోంది. గతేడాది (2020) అన్‌రిజర్వుడ్ కోటాలో 919 ర్యాంకు దాటిన వారికి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (బీవీఎస్సీ), 1588 ర్యాంకు దాటిన వారికి బీఎస్సీ అగ్రికల్చర్ (ఏజీ బీఎస్సీ) కోర్సుల్లో సీటు రాలేదని మెరిట్ విద్యార్థులు వాపోయారు. జనరల్ కోటాలో ఎంబీబీఎస్ సీటు పొందని వారంతా ఈ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపడమే దీనికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.
సంస్కరణలు తీసుకొస్తున్నాం..
దేశంలోనే అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో వ్యవసాయ డిగ్రీ కోర్సులు నిర్వహించడానికి సంస్కరణలు తీసుకొస్తున్నాం. డిగ్రీ విద్యార్థుల వార్షిక పరీక్ష పత్రాలను స్కాన్ చేసి, ఆన్‌లైన్‌లో పంపి దిద్దేలా సంస్కరణలు తెచ్చాం. వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలను ఇతర రాష్ట్రాల వ్యవసాయ వర్సిటీలతో తయారు చేసి తెప్పిస్తున్నాం. దీనివల్ల మెరుగ్గా చదివిన విద్యార్థులే ఉత్తీర్ణులవుతారు. వచ్చే ఏడాది మరిన్ని సీట్లు పెంచుతాం. ఆదిలాబాద్‌లో కొత్త కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అనుమతి వస్తే ఈ ఏడాదే ప్రారంభిస్తాం. - - వి.ప్రవీణ్‌రావు, వీసీ, జయశంకర్ వర్సిటీ
ఇదీ చూడండి: CM KCR review: హుజూరాబాద్‌లో ఏం జరుగుతోంది..?