కాలంతో పాటు క్రాకర్స్ తయారీలో మార్పులొస్తున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే పటాకులు అందుబాటులోకి వచ్చాయి. పండగరోజు పటాకులు కాల్చే ఆనవాయితీని కొనసాగిస్తూనే ప్రమాదకరమైన కాలుష్య ఉద్గారాలను తగ్గించే గ్రీన్ కాకర్స్ మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. రాడిష్ రాకెట్, మెంతిబాంబ్, మేరీ గోల్డ్ చక్రీ, బేసిల్ బాంబ్, రాకెట్లు, మిరపకాయ బాంబ్‌లు, సుతీల్ బాంబ్‌లు, భూచక్రాలు వంటివి అందుబాటులోకి వచ్చాయి. దీపావళికి వినియోగించే సంప్రదాయ పటాకులు చేసే శబ్దాలతో పొలిస్తే ఈ గ్రీన్ క్రాకర్స్‌తో 30 శాతం వరకు కాలుష్యం తగ్గించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం టపాసులు కొనుగోలు చేసేవారిలో మార్పు స్పష్టంగా కన్పిస్తుంది. పర్యావరణానికి హాని కలిగించని వాటిని కాల్చేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిలో ఎక్కువ శాతం గ్రీన్ టాపాసులే కావాలనే అడుగుతున్నారు. విత్తన పటాకులు మాత్రం కేవలం ఆన్‌లైన్‌లోనే లభిస్తున్నాయి.
ఈ సారి మార్కెట్‌లోకి వచ్చిన విత్తన టపాసులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఆ పటాకులు పేల్చినప్పుడు అందులోని విత్తనాలు పడినచోట మొక్కలు మొలకెత్తుతాయని తయారీదారులు చెబుతున్నారు. భారీగా కాలుష్యం వెలువడే అవకాశమున్నందున పేల్చిన చోట ఆ విత్తనాలు పడి.. కొంతవరకైనా నష్టం తగ్గించవచ్చని భావిస్తున్నారు. కాల్చిన మతాబులు పూర్తిగా భూమిలో కలిసిపోయేలా రూపొందించినట్లు చెబుతున్నారు. గతేడాది కరోనాతో వ్యాపారం సరిగ్గా లేదని.. ఈసారి మంచిగా ఉందని అమ్మకందారులు చెబుతున్నారు. పర్యావరణ హిత టపాసులు వాడకం విషయంలో ప్రజల్లో మార్పు వస్తుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:
SEED CRACKERS: మార్కెట్లోకి కొత్త సరుకు... పర్యావరణహిత బాణసంచా