దేశంలో ఏటా.. మూడు నిమిషాలకో ప్రమాదం జరుగుతోంది. రోడ్డు ప్రమాదాల్లో.. కొంతమంది గాయపడుతుండగా... మరికొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వాళ్లను సకాలంలో ఆస్పత్రిలో చేర్పించగలిగితే ప్రాణాలు కాపాడొచ్చు. ఒకవేళ ప్రాణాలు కోల్పోవడం, జీవన్మృతి చెందడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటే.. అలాంటి వారి అవయవాలను దానం చేసే విధంగా వైద్యులు కుటుంబ సభ్యులను చైతన్యపరుస్తారు. అవయవదానానికి అంగీకరిస్తే జీవన్ దాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... అవసరమైన వాళ్లకు అవయవదానం చేస్తారు.
నిర్దేశిత సమయంలో..
జీవనశైలి వ్యాధులు, ఒత్తిడి, చెడు అలవాట్ల వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు దెబ్బ తింటున్నాయి. ఔషధాలు, శస్త్ర చికిత్సలతో కొంత మంది కోలుకుంటున్నారు.. కానీ చాలా వరకు అవయవాలు దెబ్బతిని.. అవయవ మార్పడి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నారు. ఈ క్రమంలో జీవన్మృతి చెందిన వ్యక్తి నుంచి అవయవం తీసి.. నిర్దేశిత సమయంలో అవసరమైన రోగికి శస్త్రచికిత్స చేసి మార్పిడి చేయాల్సి ఉంటుంది. అంబులెన్సులో ప్రత్యేక బాక్సుల్లో.. వైద్యుల పర్యవేక్షణలో ఈ అవయవాలు తీసుకెళ్లాలి.
గ్రీన్ ఛానెల్..
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ రద్దీలో అంబులెన్సులు వెళ్లాలంటేనే చాలా సమయం పడుతుంది. అలాంటిది.. అవయవాలను ఐదు నిమిషాల్లో నిర్దేశిత ఆస్పత్రికి తీసుకెళ్లడం చాలా కష్టం. దీనికి నగర ట్రాఫిక్ పోలీసులు ఓ ఉపాయాన్ని కనిపెట్టారు. జీవన్‌దాన్ కింద అవయవాలను తీసుకెళ్లే వాహనాలకు గ్రీన్ ఛానల్(Green Channel) ఇస్తూ.. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా సరైన సమయానికి అవయవం ఆస్పత్రి చేరేలా చర్యలు తీసుకుంటున్నారు.
జంక్షన్ల వద్ద గ్రీన్లైట్లు
హైదరాబాద్ మహానగరంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలున్న కార్పొరేట్ ఆస్పత్రులు కొన్ని ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో దేశంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచీ రోగులు వచ్చి చికిత్స పొందుతుంటారు. ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి జీవన్‌దాన్ అవయవాలు తీసుకెళ్లాలంటే భాగ్యనగర ట్రాఫిక్‌తో ఇబ్బందే. దీనికోసమే నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడినుంచి ఎక్కడికి అవయవాలు తీసుకెళ్లాల్సి ఉంటుందో.. ఆ మార్గం గురించి ఆస్పత్రి వర్గాలు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందిస్తారు. ఆ మార్గంలో అంబులెన్సులు వెళ్లేలా ట్రాఫిక్ పోలీసులు గ్రీన్‌ఛానెల్(Green Channel) ఏర్పాటు చేస్తారు. అంబులెన్స్ వెళ్లే సమయంలో.. కూడళ్ల వద్ద వాహనం ఆపకుండా గ్రీన్లైట్లు(Green Channel) ఉండేలా చూస్తారు. ఆ మార్గంలో ఇతర వాహనాలను అనుమతించరు.
విమానంలో..
ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు అవయవాలు తీసుకెళ్లాల్సి వస్తే.. విమానంలో తీసుకొస్తారు. విమానాశ్రయం నుంచి గ్రీన్‌ఛానెల్ ద్వారా నిర్దేశిత ఆస్పత్రికి చేరుస్తారు. శంషాబాద్ విమానాశ్రయం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. కిమ్స్, అపోలో, యశోద, స్టార్ ఆస్పత్రులేమో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇలాంటి సమయంలో రెండు కమిషనరేట్లకు చెందిన ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకొని అంబులెన్స్‌కు గ్రీన్ ఛానెల్(Green Channel) ఇస్తున్నారు.
సలామ్ ట్రాఫిక్ పోలీస్..
శంషాబాద్ విమానాశ్రయం నుంచి కిమ్స్ ఆస్పత్రి 36 కిలోమీటర్ల దూరం ఉంది. ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి 30 కి.మీలు.. సాధారణ ట్రాఫిక్‌లో అంబులెన్స్ వస్తే గంటకు పైగానే సమయం పడుతుంది. కానీ జీవన్‌దాన్ అవయవాలను తీసుకొచ్చే అంబులెన్స్‌ను.. ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి 25 నుంచి 28 నిమిషాల్లోపే గమ్యస్థానం చేరుస్తున్నారు. ఇలా గతేడాది 20 సార్లు, ఈ ఏడాది ఇప్పటి వరకు 17 సార్లు గ్రీన్ ఛానెల్ అమలు చేశారు. దేశంలోని ఏ నగరంలోనూ ఇన్నిసార్లు గ్రీన్ ఛానెల్(Green Channel) ఇవ్వలేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల సేవల పట్ల ఆస్పత్రి వర్గాలతో పాటు, రోగుల బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.