కరపత్రాలు సైతం..
ఆయా యాప్‌ల ద్వారా అభ్యర్థులు తమ ప్రచారానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని నేరుగా ఓటర్ల చరవాణులకు చేరవేస్తున్నారు. యాప్‌లో పొందు పరిచిన ఏ అంశం ద్వారానైనా ఓటరును ఎంచుకోగానే సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఆయా వివరాలను సదరు ఓటరుకు సంక్షిప్త సమాచారం లేదా వాట్సాప్, వాయిస్ కాల్ ద్వారా నేరుగా పంపే వీలుంది. పనిలో పనిగా వాట్సాప్ సౌలభ్యం కలిగి ఉండే ఓటర్లకు తమ ప్రచార కరపత్రాలను దానికి అనుసంధానం చేసి నేరుగా పంపుతున్నారు. సాధారణంగా ఇతరుల నంబర్లకు వాట్సప్ పంపాలంటే సదరు వ్యక్తి నంబరు తమ ఫోన్‌లో సేవ్ చేసుకుని ఉండాలి. అయితే ఈ విధానం ద్వారా అటువంటి అవసరం లేకుండానే నేరుగా పంపే వీలుంది. దీంతో అభ్యర్థులు తమ అనుచరగణాల ఫోన్లలో యాప్‌లను నిక్షిప్తం చేసి ప్రచారాన్ని నిర్వహించాలని సూచిస్తున్నారు. ప్రత్యేకమైన విషయమేమిటంటే ఇందులో తమకు సంబంధించిన ఓటర్లను టిక్ చేసుకునే అవకాశం ఉంది. అలా ఎంపిక చేసుకున్న ఓటర్ల జాబితాను యాప్‌లో ప్రత్యేకంగా దర్శనమిస్తుండటం గమనార్హం.
అభ్యర్థికో యాప్
ఓటరుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అనేక సంస్థలు సేకరించి ఉంచుకున్నాయి. అభ్యర్థుల పేర్లతోపాటు డివిజన్ల పేర్లతో అందమైన వాల్‌పేపర్ల డిజైన్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాయి. ఏపీకే రూపంలో ఉండే ఒక్కో ఫైల్‌ను ఆయా అభ్యర్థులకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నారు. చరవాణుల ద్వారా ఆయా పరిజ్ఞానాన్ని ఎవరికి పంపినా వారు తమ ఫోన్లలో యాప్ రూపంలో నిక్షిప్తం చేసుకునే వీలుంది. ఆయా యాప్‌ల్లో ఓటర్ల పేర్లు, ఇంటి నంబర్లు, పోలింగ్ బూత్‌లు, ఓటరు ఐడీ (ఎపిక్ నంబరు) ఆధారంగా వెతికి పట్టుకునే వెసులుబాటును కల్పించారు. అందులో ప్రాథమిక సమాచారంతోపాటు చిరునామా, ఓటరు జాబితా క్రమ సంఖ్య, పోలింగ్ స్టేషన్ నంబరు, దాని చిరునామా, బూత్ నంబరు వంటి సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. అంతేగాకుండా ఓటర్ల ఫోన్ నంబర్లూ ఉంటాయి.
- ఇదీ చదవండి: భాజపా గద్దెనెక్కే సమయం ఆసన్నమైంది: జేపీ నడ్డా