రాష్ట్రంలో కుమ్మరి, శాలివాహన కులవృత్తులు నిర్వహించే వారికి కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త తెలియ చేసింది. ప్రభుత్వం అందించిన శిక్షణ పూర్తి చేసుకున్న 320 మంది కుమ్మరి వృత్తి కళాకారులకు ఆధునిక యంత్రాలను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలతో బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
హుజూరాబాద్‌లో ఐదు మండలాలకు మంజూరు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మండలానికి ఒకటి లెక్కన ఐదు మండలాలకు ఆధునిక కుండల తయారీ బట్టీలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి ద్వారా మట్టి పాత్రలు, మట్టి నీళ్ల కూజాలు, వాటర్ బాటిళ్లు, టీకప్పులు, మట్టి విగ్రహాలు, దీపకుండీలు, ఇతరత్రా అలంకరణ సామాగ్రి అత్యంత వేగంగా తయారు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. వివిధ రకాల డిజైన్లతో మట్టిపాత్రలు తయారు చేయడానికి వీలవుతుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
శాలివాహన, కుమ్మరి కులస్థుల ఆదాయం పెంచేందుకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల విలువ గల ఆధునిక పాటరీ యంత్రాలు రూ.80 వేల సబ్సిడీతో అందుతాయన్నారు. ప్రభుత్వం శిక్షణ అందించిన అనంతరం 320 మంది తమ వాటాగా 20 వేల రూపాయల్ని జమచేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా హుజురాబాద్‌లోని కుమ్మరి వృత్తిదారుల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని.. వారికి ఆర్థిక స్వావలంబన కోసం ఆధునిక పాటరీ యంత్రాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: Harish Rao on BJP: రూపాయి బొట్టుబిళ్ల దిక్కు ఉందమా? కేసీఆర్ వైపు ఉందామా?