జొన్న రైతుల పోరాటం ఫలించింది. యాసంగి సీజన్‌లో జొన్న పంట కొనుగోళ్లు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొద్ది రోజులుగా సర్కారు కొనుగోళ్లు జరపకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అతి తక్కువ ధరకే జొన్నపంటను తెగనమ్ముకున్నారు. అయితే కాస్తా ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచింది. అందుకు అవసరమైన నిధులకు సంబంధించి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) లేదా ఇతర బ్యాంకుల నుంచి రూ.94.42 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడానికి ప్రభుత్వం పూచీకత్తు సమర్పించనుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘనందన్‌రావు... బ్యాంకు గ్యారంటీ ఉత్తర్వులు జారీ చేశారు.
రైతులు తీవ్రంగా నష్టపోయారు
ఇప్పటికే... ప్రభుత్వం కొనుగోళ్లు జరకపోవడంతో అధిక శాతం రైతులకు తక్కువ ధరలకే ప్రైవేటు వ్యాపారులకు తెగనమ్ముకున్నారు. జొన్న క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.2,660 ఉండగా... ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బోధన్, నేరేడిగొండ మండలాల్లో చాలా మంది రైతులు రూ.900 నుంచి రూ.1200 విక్రయించారు. దీంతో రైతుల ఆందోళనల నేపథ్యంలో ఆలస్యంగానైనా తాజాగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ పరిణామం సంతోషకరమే అయినప్పటికీ... జరగాల్సిన అపార నష్టం ఇప్పటికే జరిగిపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సీజన్‌లో 1,19,655 ఎకరాల విస్తీర్ణంలో జొన్న పంట సాగైంది. 31,711 మెట్రిక్ టన్నుల జొన్నల ఉత్పత్తి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 63,422 మెట్రిక్ టన్నులు దిగుబడులు వచ్చాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే పెద్ద ఎత్తున జొన్న సాగు దృష్ట్యా... యాసంగి సీజన్‌లో సకాలంలో సేకరించకపోవడంతో రైతులు భారీగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో జొన్నలు కొనుగోలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ రైతు స్వరాజ్య వేదిక ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సంగేపు బొర్రన్న ఈ నెల 1న హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. పిల్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ కేసు తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. ఇది రైతుల విజయమని ఆ సంస్థ ప్రతినిధి తన్నీరు శ్రీహర్ష ఆనందం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు సాధించుకునేంత వరకూ నిరసనలు, ఆందోళనలు సాగిస్తామని.. ఈ సందర్భంగా రైతుల పోరాటానికి అభినందనలు తెలియజేశారు.