తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉందన్న గవర్నర్... ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. వ్యవసాయ, ఐటీ ఫార్మస్యూటికల్ రంగాలలో తెలంగాణ ముందంజలో ఉందని పేర్కొన్నారు.
నా పుట్టిన రోజు కూడా ఈరోజే...
గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావటం దైవ సంకల్పంగా భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించి, వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆత్మ బలిదానాలు చేసిన అమర వీరులకు నివాళులు అర్పించారు. సంక్షోభ సమయంలో ప్రజలకు ఎనలేని సేవలు చేసిన వైద్యులు, ఇతర మెడికల్ సిబ్బందికి గవర్నర్ కృతజ్ఞతలు తెలుపుతూ.. సెల్యూట్ చేశారు.
పోలీసు సిబ్బందికి సత్కారం..
విపత్కరమైన కరోనా పరిస్థితులలో రక్తదానం చేయడం, ఇతర సేవా కార్యక్రమాలు చేసిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేష్ భాగవత్లను సత్కరించారు. మిలిటరీ అధికారులైన ఏ. జోషి, ఇంద్ర దీప్ సింగ్లతో పాటు గాంధీ ఆసుపత్రి, కింగ్ కోటి హాస్పిటల్, ఆయుర్వేదిక్ హాస్పిటల్ సూపరింటెండెంట్లను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి డాక్టర్ కె. పిచ్చి రెడ్డి, వాలంటీర్ లను కూడా గవర్నర్ సత్కరించారు.
ఇదీ చదవండి : భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష