విద్యాభారతి సంస్థ నూతన విద్యా విధానంపై విద్యార్థుల్లో అవగాహన, చైతన్యవంతం చేయడానికి ‘మై ఎన్ఈపీ’ నిర్వహించిన పోటీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ప్రముఖ సైంటిస్ట్ డా.కస్తూరి రంగన్, ఇతర సభ్యులు విద్యారంగంలో భారత్‌కు ప్రాచీన కాలం నుంచి ఉన్న గొప్ప పేరును, వైభవాన్ని తిరిగి సాధించాలన్న లక్ష్యంతో ఎన్ఈపీ–2020 ప్రవేశపెట్టారని తమిళిసై అన్నారు.
మార్పుల ద్వారా
విద్యారంగంలో సమూల మార్పుల ద్వారా ఆధునిక సాంకేతిక యుగానికి సంబంధించి వివిధ రంగాల్లో భవిష్యత్ నాయకులను తయారు చేయడానికి తోడ్పడుతుందన్నారు. వివిధ రంగాల సమ్మిళిత పరిశోధనా పద్ధతులు, వృత్తి విద్య, ప్రాక్టికల్ విద్యావిధానం, ఆవిష్కరణల ప్రోత్సాహం, ప్రపంచ స్థాయి ఆధునిక విద్యా పద్ధతులు ఈ జాతీయ విద్యావిధానంలో ఉండటం ఆహ్వానించదగ్గ అంశాలన్నారు.
విద్యార్ధుల్లో అవగాహన ద్వారా
భారత్‌ను విజ్ఞాన-ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడం, నాలెడ్జ్ సూపర్ పవర్‌గా తీర్చిదిద్ధడం అనే లక్ష్యాలతో వచ్చిన ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని సమర్థవంతంగా అమలు కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ జాతీయ విద్యా విధానం–2020పై విద్యార్ధుల్లో విస్తృత అవగాహన కల్పించడానికి ‘మై ఎన్ఈపీ’ కార్యక్రమాన్ని చేపట్టిన విద్యాభారతి కృషిని గవర్నర్ అభినందించారు.
పలువురు హాజరు
ఈ కార్యక్రమంలో విద్యాభారతి దక్షిణ మధ్య అధ్యక్షులు సీహెచ్.ఉమామహేశ్వరరావు, శ్రీసరస్వతి విద్యా పీఠం అధ్యక్షులు ప్రొ.టి.తిరుపతిరావు, కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటి సెక్రటరీ అన్నదానం సుబ్రమణియం, ఎన్ఈపీ ఆర్టీ మెంబర్ పి.మురళి మనోహర్, విద్యాభారతి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్.సుధాకర్ రెడ్డి, విద్వత్ పరిషత్ అధ్యక్షులు ఆవుల మంజులత, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : వైద్య ఆరోగ్య శాఖ నూతన విధానాలకు సిద్ధం కావాలి: ఈటల