GHMC second phase plans to control traffic: హైదరాబాద్ మహానగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం.. మొదటి దశలో చేపట్టిన నిర్మాణాల వల్ల చాలా జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది. ఈ ప్రాజెక్టు కింద రెండో విడత పనుల కోసం ప్రణాళికలు వేగంగా జరుగుతున్నాయి. ఎస్ఆర్డీపీ రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపితే.. అనేక జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇందుకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ అధికారులు ప్రణాళిక రూపొందించారు.
ఎస్ఆర్డీపీ మెుదటి దశ పనులు: ఎల్బీనగర్ జంక్షన్‌లో దాదాపు రూ. 600 కోట్లతో పైవంతెనలు, అండర్ పాస్ లు నిర్మించడంతో... ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది. టోలిచౌకిలో మొదటి ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. తర్వాత దుర్గం చెరువు వంతెన నుంచి మొదలయ్యే... షేక్‌పేట పైవంతెన, శిల్పాలేఅవుట్ పైవంతెన.. అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో కూడా రాకపోకలు సుగమమయ్యాయి. ఇవన్నీ ఎస్ఆర్డీపీ మొదటి దశ పనులే. ఎస్సార్డీసీ మొదటి దశలో మొత్తం రూ.6763 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఇప్పటి వరకు రూ.2909 కోట్ల పనులు పూర్తయ్యాయి. చివరి దశలో రూ.3854 కోట్లు పనులు ఉన్నాయి.
రెండో దశ నిర్మాణానికి నిధులు ప్రభుత్వం కేటాయించాలి: రెండో దశ కింద దాదాపు రూ.1,935 కోట్లతో కీలకమైన వంతెనలు ఇతరత్రా నిర్మాణాలను చేపట్టడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీన్ని ఆమోదించాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చారు. మొదటి దశ ప్రాజెక్టు వ్యయం మొత్తం వివిధ బ్యాంకుల నుంచి బల్దియా రుణం కింద తీసుని.. పూర్తి చేసింది. రెండో దశ పనులకు రుణం కింద కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఏ ప్రదేశంలో ఏ వంతెన: ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోందని.. కొత్తగా తీసుకునే రుణాలను భరించ లేని స్థితిలో ఉన్నామని బల్దియా అధికారులు అంటున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. రుణం కింద ఈ నిధులను సేకరించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రెండో దశలో ప్రతిపాదించిన నిర్మాణ వ్యయం రూ.70 కోట్లతో బండ్లగూడ జంక్షన్ దగ్గర ఆరులైన్ల పై వంతెన, రూ.70 కోట్లతో ఒమర్ హోటర్ దగ్గర ఆరులైన్ల గ్రేడ్ సెపరేటర్, 100 కోట్ల రూపాయలతో జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒకటి, జూబ్లిహిల్స్ రోడ్డు నంబర్ 45 దగ్గర ఒక వంతెన నిర్మించనున్నారు.
175 కోట్లతో రేతిబౌలి, నానల్‌నగర్ దగ్గర మల్టిలేవల్ పై వంతెన, రూ.135 కోట్లతో కూకట్‌పల్లి వై జంక్షన్ దగ్గర పై వంతెన, రూ.1080 కోట్లతో కాజాగూడ దగ్గర టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.20 కోట్లతో మాణికేశ్వర్ నగర్ పై వంతెన..రూ.90 కోట్లతో ఆరాంఘర్ జంక్షన్ దగ్గర రెండు వైపులా ఆర్ యూబీలు... రూ.45 కోట్లతో ఫాక్స్ సాగర్ సర్ ప్లస్ నాలా దగ్గర పై వంతెన నిర్మాణాలకు ప్రాణాళిక రూపొందించారు.
- క్రింది విధంగా నిర్మాణాలకు వ్యయాన్ని కేటాయించారు
రహదారి రకం | నిర్మాణ వ్యయం(రూ.కోట్లలో) |
బండ్లగూడ జంక్షన్ దగ్గర ఆరులైన్ల వంతెన | 70 |
ఒమర్ హోటర్ దగ్గర ఆరులైన్ల గ్రేడ్ సెపరేటర్ | 70 |
జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ ఆరులైన్ల గ్రేడ్ సెపరేటర్ | 100 |
రేతిబౌలి,నానల్‌నగర్ మల్టిలేవల్ పై వంతెన | 175 |
కూకట్‌పల్లి వై జంక్షన్ దగ్గర పై వంతెన | 135 |
కాజాగూడ దగ్గర టన్నెల్ | 1080 |
ఆరాంఘర్ జంక్షన్ దగ్గర రెండు వైపులా ఆర్ యూబీలు | 90 |
ఫాక్స్ సాగర్ సర్ ప్లస్ నాలా దగ్గర పై వంతెన | 45 |
ఇతర పనులకు | 170 |
మెుత్తం | 1935 |
ఇవీ చదవండి: