హైదరాబాద్ రోడ్లు, నాళాల పరిస్థితిపై మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులతో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్... జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. రోడ్ల నిర్వహణలో భాగంగా... గుంతలు పూడ్చడం, నూతన లేయర్ రోడ్లు వేయడానికి వేర్వేరుగా టెండర్లు పిలిచేవారు. ఈ విధానంలో ఏజెన్సీల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు వచ్చేవి. ఇలా కాకుండా నగరంలో ప్రధాన రహదారులను గుర్తించి వాటిని నిర్వహించేందుకు ఐదేళ్ల కాలానికి టెండర్లు పిలవాలని బల్దియా భావిస్తోంది.
ఐదేళ్ల కాలానికి టెండర్లు
టెండర్లు దక్కించుకున్న సంస్థలు బల్దియా ప్రమాణాల మేరకు గుంతలు పూడ్చడం, అవసరమైనప్పుడు కొత్త రోడ్లు వేయడం, గ్రీనరీ, రోడ్ క్లీనింగ్, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ బాధ్యత వర్కింగ్ ఏజెన్సీలకే అప్పగించాలని యోచిస్తోంది. ఐదేళ్ల పాటు ట్రాన్స్ కో, జల మండలి, ప్రైవేట్ సంస్ధలు భవిష్యత్తు ప్రణాళికలను కనీసం 6 నెలల ముందుగానే ఏజెన్సీలకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వేసిన రోడ్లు, ఫుట్‌పాత్‌ల మరమ్మతులకు శాఖల మధ్య సమన్వయ లోపం ఉండదు. అదే సంస్థపై ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత ఉండనున్నందున... దీర్ఘకాలం మన్నేలా ప్రమాణాలు పాటించే అవకాశం ఉంది. కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ కార్యక్రమంలో 709 కిలోమీటర్ల రోడ్లను 7 యూనిట్లుగా విభజింజి దీర్ఘకాలిక టెండర్లను బల్డియా పిలవనుంది. ఈ కార్యక్రమంతో రోడ్ల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు తొలగిపోతాయని ఇంజినీరింగ్ అధికారులు ఆశాభావం వారు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: హుజూర్నగర్ ఉప పోరులో పెరిగిన ఓటింగ్ శాతం