జీహెచ్‌ఎంసీ ఎన్నికల వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వ పెద్దలతో ‘ఈనాడు- ఈటీవీ భారత్’ ప్రతినిధి మాట్లాడితే.. ‘అబ్భే. గడువులోగా అంటే జనవరిలో బల్దియా పాలకవర్గ ఎన్నికలు జరుగుతాయి.. ఇందులో మరో మాటకు తావులేదు. దుబ్బాక ఫలితం ఎలా ఉన్నా గ్రేటర్ బరిలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోబోతున్నాం’ అంటూ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ ఉంటుందని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తమ మానాన తాము ఎన్నికల ఏర్పాట్లను చేయడంలో బిజీగా మారిపోయింది.
గ్రేటర్ పాలకవర్గ ఎన్నికలు 2016 ఫిబ్రవరి 2న జరిగాయి. నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ప్రస్తుతం పాలకవర్గ గడువు ముగిసిపోతోంది. ఈలోపులో కొత్త పాలకవర్గం ఏర్పాటు చేయాలి. అసాధారణ పరిస్థితి ఏర్పడితే ఎన్నికలు నిర్వహించకుండా 6 నెలలపాటు ప్రత్యేక అధికారి పాలనను ఏర్పాటు చేయొచ్ఛు బల్దియాలో ఉన్న 150 డివిజన్లకుగాను 99 డివిజన్లలో అధికార తెరాస పార్టీ ఘనవిజయం సాధించింది. ఈసారి కూడా కాస్త అటుఇటుగా స్థానాలు సాధిస్తామన్న ధీమాలో ఈ పార్టీ అగ్రనేతలున్నారు. అయితే మహానగరాన్ని ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తడంతో వేలాది కాలనీలు ముంపు బారినపడ్డాయి. పరిస్థితి ఎంతదారుణంగా మారిదంటే 26 రోజులైనా ఇంకా అనేక కాలనీలు ముంపులోనే ఉన్నాయి.
బాధితులకు తోడ్పాటు అందించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.550 కోట్ల పరిహారాన్ని మంజూరు చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేశారు. ఈ పంపిణీలో అవకతవకలు జరగడంతో కొద్దిరోజులు ఆ పంపిణీని నిలిపివేసి తాజాగా అర్హులందరికీ పంపిణీ చేయడం ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొనాలనుకుంది. ముంపు పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఎన్నికల సంఘం దాదాపు ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. మరికొద్ది రోజుల్లో ఓటర్ల జాబితా కూడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో బల్దియా ఎన్నికలను ప్రభుత్వం నిలిపివేస్తుందంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆ పార్టీ అగ్రనేతలకూ ఇలాంటి ఫోన్లే వస్తున్నాయి. ఒకవేళ ఎన్నికలను వాయిదా వేస్తే భాజపాకు భయపడి వాయిదా వేశారన్న అపవాదును ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావనలో అధికార పార్టీ నేతలున్నారు. అందుకే పార్టీ కేడర్‌ను బల్దియా ఎన్నికలకు సిద్ధం చేయాలని అంతర్గత ఆదేశాలు కూడా జారీ అయినట్లు చెబుతున్నారు.
గడువులోగా ఎన్నికలు జరుగుతాయి
బల్దియా ఎన్నికలు గడువులోగా జరుగుతాయి. ఇందులో మరోమాటకు తావులేదు. దీనికి అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఎన్నిక గురించో, ఏ పార్టీ గురించో ఆలోచించాల్సిన అవసరమే మాకు లేదు. మహానగరంలో ఆరేళ్లలో రూ.వేల కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టాం. ఇన్ని మంచిపనులు చేసిన తాము ఈ ఎన్నికల్లో సులభంగా విజయం సాధిస్తాం. అందుచేత ఎన్నికలు వాయిదా వేయబోతున్నారన్నది తప్పుడు ప్రచారమే. ఎవరూ నమ్మొద్ధు.
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- ఇదీ చదవండి: దుబ్బాకలో కారును ముంచిన చపాతి రోలర్