రాజధాని రహదారుల వ్యవస్థ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. ట్రాఫిక్ సమస్య నివారణకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో రోడ్లను తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ మరో అడుగు ముందుకేసింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్సార్డీపీ) (Strategic road development program) మొదటి దశను విజయవంతంగా తీరానికి చేర్ఛి. రెండో దశవైపు అడుగులు వేస్తోంది. ఇంజినీరింగ్ విభాగం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. కొత్తగా ఉప్పల్, నాగోల్, ఆరాంఘర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టేలా అంచనాలు రూపొందించి సర్కారు అనుమతికి పంపించారు. ప్రభుత్వం ఆమోదించగానే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు.
సికింద్రాబాద్ నుంచి రయ్‌రయ్
సికింద్రాబాద్ నుంచి రాణిగంజ్ మీదుగా ట్యాంక్‌బండ్ చేరుకోవాలంటే నరకం కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచే ఈ మార్గం కిక్కిరిసిపోతోంది. పరిష్కారంగా.. ప్యారడైజ్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు పైవంతెన నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. భూసేకరణ, ఇతర సమస్యలు కొలిక్కి వస్తే జేబీఎస్ నుంచి తూంకుంట వరకు, మేడ్చల్ హైవేపై సుచిత్ర కూడలిలో పైవంతెనలు రానున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ప్రాధాన్య క్రమంలో..
ఎస్సార్డీపీ పనులకు నిధులను జీహెచ్‌ఎంసీ బాండ్లు, బ్యాంకు రుణాల ద్వారా సమీకరిస్తోంది. నిధులు భారీగా అవసరం ఉన్నందున ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఉపయోగం లేని కొన్ని ప్రాజెక్టులను రద్దు చేయనుంది. కేబీఆర్ పార్కు చుట్టూ 6 పైవంతెనలు నిర్మించాలన్న ప్రతిపాదనలను జాతీయ హరిత మండలి కేసుతో పరిశీలన జాబితాలో చేర్చారు. ఖాజాగూడ కూడలిలో సొరంగ మార్గం, ఓఆర్‌ఆర్ వరకు చేపట్టాలనుకున్న పైవంతెన రద్దయిన విషయం తెలిసిందే.
మారనున్న రూపురేఖలు
నగరంలో కీలక కూడళ్లలో ఉప్పల్ ఒకటి. యాదాద్రి పుణ్యక్షేత్రం, వరంగల్ నగరానికి ఇక్కడి నుంచే వెళ్లాలి. లక్షలాది వాహనాలు సంచరించే ఈ కూడలి విస్తృత అభివృద్ధికి బల్దియా ఎస్సార్డీపీ విభాగం ప్రణాళిక సిద్ధం చేసింది. హబ్సిగూడ, నాగోల్ మధ్య అన్ని చౌరస్తాల్లో పైవంతెనలు నిర్మించాలని నిర్ణయించింది. రూ.350 కోట్లతో రూపొందించిన అంచనాలకు సర్కారు అనుమతి రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుతో సికింద్రాబాద్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్ వెళ్లే వాహనాలు మరింత వేగంగా గమ్యస్థానం చేరుకోవచ్ఛు ఇప్పటికే నారపల్లి వరకు భారీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తున్నారు. రామంతాపూర్ వైపు మరో పైవంతెన రానుంది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పాదచారుల కోసం ఆకాశ మార్గం చేపట్టారు. ఇవన్నీ పూర్తయితే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి.
ఇదీ చూడండి: Mutation applications : పెండింగ్‌లో 'మ్యుటేషన్' దరఖాస్తులు.. ఇబ్బందుల్లో అర్హులు