GSI Activities: హైదరాబాద్ బండ్లగూడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా- దక్షిణాది ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ఆజాదీకా అమృతమహోత్సవాలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదనపు సంచాలకులు జనరల్ జనార్థన్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ రిసోర్స్ మ్యాప్‌లను విడుదల చేశారు. హైదరాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, మెదక్, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల వనరుల చిత్రపటాలను ఆవిష్కరించారు. 2022-23 సంవత్సరంలో జీఎస్‌ఐ సదరన్ రీజియన్ భూమి, భూగర్భ జలాలు, వనరులు, భూమి కోతలు, కొండచరియలు విరిగిపడటం, సిస్మో టెక్నాలజీ తదితర 184 ప్రాజెక్టులు అమలు చేస్తుందని జనార్థన్ ప్రసాద్ వివరించారు. దక్షిణాదితోపాటు లడక్, కచ్, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో లిథియం నిల్వలపై అన్వేషిస్తున్నామని ఆయన వెల్లడించారు.
జీఎస్‌ఐ పరిధిలోని డాక్టర్ విలియం కింగ్ భూ వైజ్ఞానికశాలలో వేల ఏళ్లనాటి జంతు, వృక్ష శిలాజాలు చూసి విద్యార్థులు అబ్బురపడ్డారు. బంగారం, బొగ్గు, ఇతర ఖనిజాల నమూనాలు ప్రదర్శనలో వీక్షించారు. వజ్రకరూర్ కిమ్ బర్ లైట్, చీమకుర్తి అనార్థోసైట్, కడప బైరటీస్, కర్నూలు వైట్ క్లే, కరీంనగర్ లుకో గ్రానైట్, ఇసుక రాయి, ఖమ్మం డోలమైట్, ఇల్లందు బొగ్గు, బయ్యారం ఉక్కు నమూనాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. డైనోసార్ సహజ కలేబరం, గుడ్డు విశేషంగా ఆకర్షించింది.
భూమి, ఉపరితలంపై అంతరించిపోతున్న జీవ, జంతు, వృక్ష శిలాజాలు కనిపెట్టి సంరక్షిస్తూ గనులు, ఖనిజాల అన్వేషణ, నిరంతర పరిశోధన పథంలో ముందుకు సాగుతున్నామని జీఎస్‌ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ కాలుష్యం, ప్రకాశం జిల్లా, కర్ణాటక రాయచూర్ జిల్లాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ కలుషితాలకు కారణాలపై భూగర్భ అధ్యయనాలు చేస్తున్నట్లు జీఎస్‌ఐ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: Road accident at menur:కంటైనర్ కిందకు దూసుకెళ్లిన ఆటో.. అక్కడికక్కడే ఐదుగురు మృతి
రాష్ట్రపతి ఎన్నికల్లో 98.90% ఓటింగ్.. దిల్లీకి బ్యాలెట్ బాక్సులు!