కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. వినాయకుడి పూజకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు కోరారు.
సామూహిక నిమజ్జనం లేదు..
సెప్టెంబర్ 1న సామూహిక నిమజ్జనం వీలుకాదని.. భక్తులు సామాజిక దూరం పాటిస్తూ జరుపుకోవాలన్నారు. సహజ నీటి వనరులు ఉన్న చోట తక్కువ మందితో సాదా సీదాగా నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు.
మండపాల వద్ద ఐదుగురు చాలు
గణేష్ విగ్రహాల ఎత్తు గురించి ఎవరూ పోటీ పడవద్దని అన్నారు. మండపాల వద్ద ఐదుగురికి మించి ఉండకూడదన్నారు. మండపాల వద్ద శానిటైజర్ ఉంచడంతో పాటు మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. విగ్రహల తయారీదారులను, ఉత్సవాలపై ఆధారపడి జీవనం సాగించే వృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి అనుమతి అవసరం లేదని.. కానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఇదీ చూడండి : రాజ్ భవన్ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు