కంటికి కనిపించే శత్రువుతో పోరాటానికి ఆయుధాలు సరిపోతాయి. అదే కనిపించని వారితో పోరాటమనేది ఊహించడానికే సాధ్యపడని విషయం. సూక్ష్మాతిసూక్ష్మమైన కరోనా వైరస్‌పై మానవాళి చేస్తున్న పోరాటం సరిగ్గా ఇలాంటిదే. ఈ పోరులో ముందుండి వైరస్‌ను ఎదుర్కొనేందుకు సైనికుల్లా పనిచేస్తున్నారు వైద్య సిబ్బంది. లాక్‌డౌన్ కారణంగా సమస్త జనం ఇళ్లు దాటకుండా ఉంటే మహమ్మారి బారిన పడిన వారికి సేవలు చేసేందుకు తమ మకాంను ఆస్పత్రులకే మార్చారు. రాష్ట్రంలో కొవిడ్ ఆస్పత్రిగా వందలమందికి సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో వైద్యుల కృషి కళ్లకు కడుతోంది.
కార్పొరేట్ ఆస్పత్రికి ధీటుగా
ఏ చిన్న జబ్బు చేసినా ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గుచూపే జనానికి నేటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రధాన కేంద్రమైన గాంధీ అక్కున చేర్చుకుంటుంది. కరోనా వైరస్ నిర్ధారణ కావటంతో ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రికి ధీటుగా మూడు పుటలా పౌష్టికాహారం అందిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషి అనిర్వచనీయంగా నిలుస్తోంది.
వైరస్ బాధితుల ప్రాణాలకు పూర్తి భరోసా కల్పిస్తూ కనిపించే దేవుళ్లుగా నిలుస్తున్నారు. చికిత్సా సమయంలో నర్సులు, ఇతర సిబ్బంది చూపుతున్న చొరవ అంతాఇంతా కాదు. అతిక్లిష్ట పరిస్థితుల్లోనూ తమవారి కంటే ఎక్కువగా రోగులకు సేవలందిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవకాశం లభించటం అదృష్టంగా భావిస్తున్నట్లు ఇక్కడి వైద్యులు పేర్కొంటున్నారు.
పూల వర్షం
మార్చి 2న రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా బారిన పడిన రోగిని గాంధీ వైద్యులు పూర్తిగా కోలుకునేలా వైద్యం అందించి క్షేమంగా ఇంటికి పంపారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, జూడాలు కలిపి మొత్తం తొమ్మిద వందల మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 5 వందల మంది వరకు ఐదో తరగతి ఉద్యోగులు పనిచేస్తున్నారు.
విధుల్లో ఉన్న 430 మంది నర్సింగ్ స్టాఫ్ రోజుకు 12 గంటల పాటు రోగులకు సేవలందిస్తున్నారు. వీరిలో వయసు మీదపడిన నర్సులు, పసిపిల్లలు ఉన్న తల్లులు కూడా ఉన్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న యోధులకు సంఘీభావంగా త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ పిలుపు మేరకు గాంధీ ఆస్పత్రిపై పూల వర్షం కురిపించనున్నారు. హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు హెలికాప్టర్ల విన్యాసాలతో వారికి అభినందనలు తెలపనున్నారు.
ఇవీచూడండి: దేశవ్యాప్తంగా 24 గంటల్లో 2,411 మందికి వైరస్