భవిష్యత్‌లో విద్యుత్ అవసరాలకు యురేనియం, థోరియం లాంటి అణు మూలకాలపైనే ఆధారపడాల్సి ఉందని ఆటామిక్ మినరల్ డెవలప్మెంట్ సంచాలకులు డీకే సిన్హా తెలిపారు. హైడల్, సోలార్, బొగ్గుకు అణు విద్యుత్ ప్రత్యామ్నయమని అన్నారు. ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో కొత్త యురేనియం ప్రాజెక్టులను చేపట్టబోతున్నట్లు సిన్హా వెల్లడించారు.
నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను వాయిదా వేసినట్లు సిన్హా పేర్కొన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని... యురేనియం తవ్వకాలపై వ్యతిరేకత వచ్చినందుకే వాయిదా వేసినట్లు చెప్పారు. కడపలోని తుమ్మలపల్లిలో కొన్నేళ్లుగా యురేనియం తవ్వకాలు కొనసాగుతున్నాయని.. ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతే.. రెండో యూనిట్ ప్రారంభవుతుందని తెలిపారు. యురేనియం ఉపయోగాలను ప్రజలను వివరించి.. వారు అంగీకరించిన తర్వాత తవ్వకాలు జరుపుతామని చెప్పారు.
ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ ఆధ్వర్యంలో రేడియేషన్ - పర్యావరణం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. అణు శక్తి లాభనష్టాలపై సదస్సులో పలువురు వక్తలు చర్చించారు. దేశంలో ఉన్న బొగ్గు కొన్ని సంవత్సరాలకే సరిపోతుంది... విపత్తులు వచ్చిన సందర్భాల్లో హైడల్, పవన విద్యుత్తుపైన ఆధారపడలేమని ఏఎండీ డైరెక్టర్ సిన్హా వివరించారు.
ఇదీ చూడండి : ఏప్రిల్ 3, 4న హైటెక్స్‌లో 'ఈనాడు ప్రాపర్టీ షో'