కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు కొత్త రైల్వేలైన్ల అంశాన్ని ప్రస్తావించలేదు. బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వే కేటాయింపులను జీఎం గజానన్ మాల్యా వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనకు 6 వేల 846 కోట్లు, తెలుగు రాష్ట్రాల కొత్తలైన్లు, ఇతరత్ర బడ్జెట్ కోసం 2వేల 856 కోట్లు, డబ్లింగ్ మూడవ లైన్, బైపాస్‌ల పనుల కోసం 3వేల 836 కోట్లు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు.
రైళ్ల రద్దీకి సంబంధించిన సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 154 కోట్లు కేటాయించినట్లు గజానన్ తెలిపారు. ధర్మవరం-పాకాల-కట్‌పడి మధ్య 290 కిలోమీటర్ల డబ్లింగ్ పనులకు 2 వేల 900 కోట్లు, గుంటూరు-బీబీనగర్ మధ్య 248 కిలోమీటర్లకు 2 వేల 480 కోట్లు అవుతాయని అంచనా వేశారు. దివ్యాంగుల సౌకర్యాల కల్పనకు 672 కోట్ల రూపాయలు కేటాయించారు.
మానవరహిత గేట్లు ఏర్పాటు..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మానవ క్రాసింగ్ గేట్లు తొలగించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే చాలా వరకు మానవరహిత గేట్లు ఏర్పాటు చేయగా... మిగిలిన 104 గేట్లనూ మార్చనున్నట్లు తెలిపారు. ఆర్వోబీ, ఆర్‌యూబీ నిర్మాణాలకు 542 కోట్లు, రైల్వే పట్టాల పునరుద్ధరణకు 900 కోట్లు మంజూరు చేశారు. మన్మాడ్-నాందేడ్-సికింద్రాబాద్-డోన్-గుంతకల్-బీదర్-పర్లీ-పర్బనీ సెక్షన్లలో ప్రమాదాల నివారణకు అత్యాధునిక సాంకేతిక విధానమైన టీకాస్ అమలుకు 100 కోట్ల రూపాయలు కేటాయించారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు...
* అక్కన్నపేట్-మెదక్ కొత్తలైన్ కోసం 54 కోట్లు.
* ముద్కేడ్-పర్బనీ డబ్లింగ్ పనులకు 75 కోట్లు.
* ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు 40 కోట్లు.
* కొత్తపల్లి-మనోహారాబాద్‌కు 235 కోట్లు.
* మునీరాబాద్-మహబూబ్‌నగర్‌కు 240 కోట్లు.
* భద్రాచలం-సత్తుపల్లికి 520 కోట్లు.
* కాజిపేట-బల్లార్ష మధ్య మూడో లైన్‌కు 483 కోట్లు.
* కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్‌కు 404 కోట్లు.
* ఘట్కేసర్-యాదాద్రి మధ్య ఎంఎంటీఎస్ రెండో విడతకు 10లక్షలు.
* విజయవాడ, కాజీపేట, రేణిగుంట, వాడీ, గూటిలలో బైపాస్ లైన్ల కోసం 222 కోట్లు.
* విద్యుదీకరణ పనుల కోసం... మన్మాడ్-ముద్కేడ్-డోన్ సెక్షన్‌కు రూ.50 కోట్లు, ధర్మవరం-పాకాలకు 25 కోట్లు, నంద్యాల-ఎర్రగుంట్లకు 18 కోట్లు, లింగంపేట్ జగిత్యాల-నిజామాబాద్ 15 కోట్లు, పర్లి-వికారాబాద్‌కు 20 కోట్లు, పీపల్‌కుట్టి-ముద్కేడ్, పర్బనీ-పర్లికి 20 కోట్లు, పూర్ణ-అకోలకు 20 కోట్లు, గద్వాల్-రాయచూర్‌కు 10 కోట్లు కేటాయించారు.
* చర్లపల్లిలోని శాటిలైట్ టర్మినల్ నిర్మాణానికి 5 కోట్లు.
* కాజిపేట్ వ్యాగన్ ఓవరాలింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం 160 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: రేపు మేడారానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్