Fruit business dull in market: సంక్రాంతి పండుగ నేపథ్యంలో పండ్ల మార్కెట్ బోసిపోయింది. పండుగ సందర్భంగా తెలుగు లోగిళ్లన్నీ సంతోషంతో మునిగి తేలుతున్న వేళ... హైదరాబాద్ జంట నగరాల్లో వినియోగదారుల సందడి లోపించి టోకు, చిల్లర మార్కెట్లన్నీ కళతప్పాయి. విశిష్ట పవిత్ర దినం ముక్కోటి ఏకాదశి, భోగి, మకర సంక్రాంతి, కనుమ కోసం అధిక శాతం నగరవాసులు ఉత్సాహంగా వేడుకలు చేసుకునేందుకు తమ సొంతూళ్లకు తరలి వెళ్లారు. దీంతో వ్యాపారం లేక వర్తకులు, చిరు వ్యాపారులు డీలా పడాల్సి వచ్చింది. సాధారణంగా పండుగల సమయాల్లో పండ్ల మార్కెట్‌సహా పూలు, తినుబండారాలు, దుస్తులు, ఇతర అన్ని మార్కెట్లన్నీ కూడా జనం రద్దీగా కనిపిస్తాయి. కొవిడ్ థర్డ్ వేరియంట్ ఒమిక్రాన్ ఉద్ధృతి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వినియోగదారులు మార్కెట్లకు వస్తున్న దృష్ట్యా... చాలా చోట్ల ఉత్సాహం, సందడి కనిపించలేదు.
ధరలు ఓకే
టోకు, చిల్లర మార్కెట్లలో యాపిల్, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, యాపిల్ బేర్, పుచ్చ, జామ, రేగి, ద్రాక్ష తదితర పండ్లు కొనుగోలు చేయడంపై వినియోగదారులు ఆసక్తి చూపారు. 40 యాపిల్ పండ్ల బాక్స్ రూ. 500 నుంచి 600, యాపిల్ బేర్ బాక్స్ - 450 నుంచి 500, 10 కిలోల ద్రాక్ష బాక్స్- 550, దానిమ్మ బాక్స్ - 500, పుచ్చకాయ 10 కిలోలు - రూ. 250 చొప్పున ధరలు పలికాయి. అవే చిల్లర మార్కెట్లో మాత్రం మరో 50 శాతం అదనంగా కలిపి అమ్ముతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి పర్వదినం సమయంలో టోకు మార్కెట్‌లో పండ్ల ధరలు కాస్త పర్వాలేదని, ధరలు సాధారణంగా ఉన్నాయని వినియోగదారులు తెలిపారు.
అంతదూరం వెళ్లలేక
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను మూసివేసి నగర శివారు బాటసింగారం లాజిస్టిక్స్ పార్కుకు తరలించిన నేపథ్యంలో చాలా మంది కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు, ఇతర చిరు వ్యాపారులు సైతం వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఎక్కడపడితే అక్కడ దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్‌బీ నగర్ మార్గం, కొత్తపేట నుంచి నాగోల్ మధ్య రోడ్లపై ఇరువైపులా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. పోలీసులు వారించినా... వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నా కూడా మొండిగా వ్యవహరిస్తున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో క్రయవిక్రయాలు.. గతేడాది సెప్టెంబరు 25 నుంచి నిలిపేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ... గేట్లకు తాళాలు వేసింది. అక్టోబరు 1 నుంచి బాటాసింగారం లాజిస్టిక్ పార్కులో పండ్ల వ్యాపార లావాదేవీలను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. బాటసింగారంలో పండ్ల మార్కెట్‌లో కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 22 ఎకరాల విస్తీర్ణం గల గడ్డిఅన్నారం మార్కెట్ స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. సెప్టెంబరు 30న ఈ ప్రాంతాన్ని వైద్యారోగ్య శాఖకు అప్పగించింది. ఇక అప్పట్నుంచి మార్కెటింగ్ శాఖ నిర్ణయాన్ని కొందరు వ్యాపారులు వ్యతిరేకిస్తూ తాత్కాలికంగా ఉప్పల్ శిల్పారామం వద్ద భగాయత్ సొసైటీ ప్రాంగణంలో పండ్లు విక్రయిస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలు
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను బాటసింగారంలో ఏర్పాటు చేసిన కొత్త మార్కెట్‌కు తరలించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తరలివెళ్లేందుకు మార్కెట్ కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులకు నెల రోజులు గడువిచ్చింది. ఈ నెల రోజులూ గడ్డిఅన్నారం మార్కెట్లో వ్యాపారం చేసుకోవచ్చని... గడువు ముగిసేలోపు మార్కెట్ తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు డిసెంబరు 13న హైకోర్టు ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డును నగర శివారు అబ్ధుల్లాపూర్‌మెట్ సమీపంలోని బాటసింగారం లాజిస్టిక్స్ పార్కుకు తరలించాలన్న ప్రభుత్వ ఆదేశాలను నిలువరించాలంటూ మార్కెట్ కమీషన్ ఏజెంట్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అంశంపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌లో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించింది. బాటసింగారం లేదా కొహెడలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి తరలిస్తే తాము వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని వ్యాపారులు చెప్పుకొచ్చారు.
కూల్చేందుకు చర్యలు
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికే మూసేసిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో అత్యాధునిక వసతులతో కూడిన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి సహకరించక తప్పదని న్యాయమూర్తులు తేల్చి చెప్పిన విషయం విదితమే. హైకోర్టు ఇచ్చిన గడువు కూడా పూర్తైన నేపథ్యంలో... ఇక త్వరలోనే గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ యార్డులో షెడ్లు, ఫ్లాట్‌ఫాంలు, భవనాలు, ఇతర నిర్మాణాలు కూల్చివేసేందుకు అధికారయంత్రాంగం సిద్ధమవుతోన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'మర్యాదలైనా.. రుచులైనా.. గోదారోళ్ల ప్రత్యేకతే వేరు'