రైతుబంధు పథకంలో మార్పులు చేయాలని ప్రభుత్వానికి సుపరిపాలనా వేదిక లేఖ రాసింది. రైతుబంధు కింద ప్రభుత్వం ఏటా 59లక్షల 21వేల మంది రైతులకు 15వేల 233కోట్లు పంపిణీ చేస్తోందని..సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు. ఇందులో ఐదెకరాల లోపు ఉన్న రైతులు 53.54 లక్షల మంది రైతులున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఐదెకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న రైతులను రైతుబంధు పథకం నుంచి తప్పించి కేవలం చిన్న, సన్నకారుల రైతులకు సాయం అందించాలని పద్మనాభరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల ఏటా ప్రభుత్వానికి 10వేల కోట్లు ఆదా అవుతుందని ఆయన అన్నారు. కేంద్రం రైతులకు అందిస్తున్న 6వేల రూపాయల సాయం కూడా 5ఎకరాల లోపు ఉన్న రైతులకే వర్తిస్తోందని పద్మనాభరెడ్డి తెలిపారు.
ఐదు కంటే ఎక్కువ ఎకరాలున్న రైతులు...వ్యవసాయం చేయకుండా భూమిని కౌలుకు ఇచ్చి... రైతుబంధు ద్వారా ఏటా ఎకరానికి వచ్చే 10వేల రూపాయలను తీసుకుంటున్నారని... దీనివల్ల ప్రభుత్వం ఉద్దేశం నెరవేరడంలేదని పద్మనాభరెడ్డి తెలిపారు. కొంతమంది భూమిని సాగు చేయకుండానే రైతుబంధు సాయం పొందుతున్నారని... వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం రైతుబంధు పథకంలో మార్పులు, చేర్పులు చేయాలని పద్మనాభరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: విశ్వేశ్వరయ్య భవన్కు బెస్ట్ స్టేట్ సెంటర్ అవార్డ్