ఐదు కోట్ల ఆంధ్రులకు ఒకటే రాజధాని.!
సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వచ్చిన వారంతా ఆందోళనలో పాల్గొన్నారు. ఏపీ రాజధాని కోసం తాము సైతం అంటూ వివిధ రకాల్లో నిరసనలు తెలిపారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ జగన్ కోరితే.. నమ్మి ఓట్లు వేశామని మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని అధోగతి చేయవద్దంటూ మహిళలు కోరుతున్నారు. ఐదుకోట్ల ఆంధ్రులకు ఒకటే రాజధాని అని.. అది అమరావతేనని నినదించారు.
ఇవాళ పూజలతో నిరసన
32వ రోజైన ఇవాళ.... ఏపీలోని మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహించనుండగా... వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు... పూజలు చేసి నిరసన తెలపనున్నారు.
సంఘీభావ ర్యాలీలు
గుంటూరు జిల్లా తెనాలిలో 5వేల మంది మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మూడు రాజధానులు వద్దంటూ భారీ ఎడ్లబండ్ల ప్రదర్శన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో రాజధాని అంశంపై ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం నేతలు... ప్లకార్డులు పట్టుకుని ద్విచక్రవాహనాలపై ర్యాలీ చేపట్టారు. తిరుపతిలో పరసాలవీధి నుంచి గాంధీరోడ్డు మీదుగా నాలుగు కాళ్లమండపం వరకు ర్యాలీ సాగింది.
ఇవీ చూడండి: కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్