Former MP Boora Narsaiah Goud criticized KTR: కేంద్రంపై అర్ధరహిత విమర్శలు చేస్తున్న మంత్రి కేటీఆర్.. అధికారం అన్ని రోజులు మీకే ఉండదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హితవు పలికారు. మీ దృష్టిలో ప్రజలు ఓట్లేస్తే హీరోలు.. లేదంటే జీరోలా అని ప్రశ్నించారు. మీరు ఇప్పటికే అభద్రతా భావంలో ఉన్నారనేది తెలంగాణ ప్రజానీకానికి తెలుసన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందో, లేదోనని.. తమ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భయపడుతున్నారనీ ఎద్దేవా చేశారు. అందుకే రాత్రికి రాత్రి జీవోలు వస్తున్నాయని విమర్శించారు. భూములు కూడా కబ్జా చేస్తున్నారని దుయ్యబట్టారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. ఔరంగాబాద్ సభకు భారీగా యాడ్స్ ఇచ్చారనీ మండిపడ్డారు. కేసీఆర్.. పొలిటికల్ విజయ్ మాల్యాలాగా తయారయ్యారనీ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఉన్న కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, కేసీఆర్ నియంతలాగా పాలన చేస్తున్నారని విమర్శించారు.
రాయల తెలంగాణ అని ఒక ఏపీ నేత అంటున్నారనీ.. ఏపీలో ఓట్లు పొందాలని కేసీఆర్ చేస్తున్న మోసంలాగా అనిపిస్తోందనీ ఆరోపించారు. తెలంగాణ తల్లికి మోసం చేశారు. ఇప్పుడు తెలుగు తల్లికి మోసం చేయాలని చూస్తున్నారనీ ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దన్నారు. బీఆర్ఎస్ నిర్వహించేది ఆత్మీయ సమ్మేళనాలు కాదని.. ఆత్మ వంచన సభలనీ దుయ్యబట్టారు.
ఐటీ రంగంలో దేశంలో హైదరాబాద్ మొదటిస్థానంలో నిలిచిందని.. బీఆర్ఎస్ ప్రచారం చేసేదంతా అవాస్తవమని.. కర్ణాటక నాలుగు లక్షల కోట్ల రూపాయలతో ఐటీ ఎగుమతులతో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని, మహారాష్ట్ర రెండో స్థానం, హైదరాబాద్ మూడో స్థానంలో ఉందని అన్నారు.
"వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందో, రాదోనని.. తమ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భయపడుతున్నారు. క్యాడర్‌ను కాపాడుకోవడానికే ఆత్మీయ సభలు నిర్వహిస్తున్నారు. అవీ ఆత్మీయ సభలు కాదు.. ఆత్మవంచన సభలు. ప్రజధనమంతా యాడ్స్‌కు ఇష్టారీతిన ఖర్చుపెడుతున్నారు. కేసీఆర్.. పొలిటికల్ విజయ్ మాల్యాలాగా తయారయ్యారు". - బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎంపీ
ఇవీ చదవండి: