New Gurukuls in Telangana :బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ఈ విద్యా సంవత్సరం మరో 33 గురుకులాలు ఏర్పాటు కానున్నాయి. తొలుత 5, 6, 7 తరగతులతో వీటిని ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే బీసీ గురుకుల సొసైటీ అధికారులు భవనాలను గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టారు. కొత్త గురుకులాల్లో మరో 7,920 మంది విద్యార్థులకు ప్రవేశాలు లభించనున్నాయి.
ప్రస్తుతం 5, 6, 7 తరగతులకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలు రూపొందించి అడ్మిషన్లు కల్పించనున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే పాఠశాలలతో కలిపి రాష్ట్రంలో అత్యధిక గురుకుల విద్యాలయాలు(314) ఉన్న సొసైటీగా బీసీ గురుకుల సొసైటీ అవతరించనుంది.
రెండో విడత ఎంపిక జాబితా వెల్లడి.. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి రెండో విడత మెరిట్ జాబితాలో ఎంపికైన విద్యార్థుల వివరాలను ఎస్సీ గురుకుల కార్యదర్శి రొనాల్డ్‌రాస్ ప్రకటించారు. వీరు నేటి నుంచి 29 వరకు సంబంధిత గురుకుల పాఠశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు.