పక్షుల మరణాలకు సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా వన్యప్రాణులు తిరిగే ప్రాంతాలు, అడవులపై నిఘా ఉంచామని అటవీ అధికారులు తెలిపారు. బర్డ్ ఫ్లూ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు సంక్రాంతి సందర్భంగా ఎగురవేసే పతంగుల విషయంలో నైలాన్, ఇతర కృత్రిమ మంజాల నిషేధంపై అరణ్య భవన్లో ఏన్జీఓలతో అటవీ అధికారులు సమావేశమయ్యారు.
మరణించిన పక్షులను జాగ్రత్తగా ప్యాక్ చేసి, ల్యాబ్‌కు పంపాలని వాటి మరణానికి గల కారణాలను తెలుసుకోవాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు చనిపోయిన పక్షులను గమనిస్తే అరణ్య భవన్‌లోని వైల్డ్ లైఫ్ కంట్రోల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-425-5364 ద్వారా అధికారులకు సమాచారం తెలియజేయాలని కోరారు.
జిల్లా యంత్రాగం, పశుసంవర్థక శాఖ సమన్వయంతో నివారణ చర్యలు తీసుకోవాలని, చనిపోయిన పక్షుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరినట్లు తెలిపారు. హైదరబాద్‌లోని నెహ్రూ జూపార్కు, వరంగల్‌లోని కాకతీయ జూపార్కులలో ముందస్తు పరిశుభ్రత చర్యలు తీసుకున్నామని వివరించారు.
సింథటిక్ మాంజాల నిషేధం కొనసాగుతోందని అటవీ అధికారులు తెలిపారు. వాటి వల్ల చిన్న పిల్లలకు, పక్షులకు, దిచక్రవాహన దారులకు ప్రమాదం పొంచి ఉందని వివరించారు. కృత్రిమ మాంజాల వల్ల జంతువులు, పక్షులు గాయపడినా... మరణించినా... మూడు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష , రూ.10 వేలకు తగ్గకుండా జరిమానా ఉంటుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: చెరువులు కనపడటమే పాపం.. వ్యర్థాలతో నింపేస్తున్నారు!