Footover Bridges in Hyderabad: భాగ్యనగరం లక్షలమంది జీవనోపాధికి నెలవైన కేంద్రం. ఆ కారణంగానే ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం ప్రజలు హైదరాబాద్‌కు తరలివస్తారు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు సైతం అధికంగా ఉంటాయి. పాదచారులకైతే రోడ్లు దాటడం చాలా ఇబ్బందికరంగా మారుతొంది. ఈ సమస్యను అధిగమించాలనే జీహెచ్ఎంసీ రెండేళ్ల క్రితం 22 పుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టింది. వాటిని 2022లోపు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అయితే వాటి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగకపోతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటంలేదు.
అనునిత్యం వందలాదిగా వచ్చే వాహనాలతో ప్రజలు రోడ్డు దాటడానికి తీవ్ర అవస్థలు పడుతుండటంతో మహానగర పాలక సంస్థ 75 కోట్లకుపైగా వ్యయంతో 22 పుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టింది. అయితే వాటిలో 8 మాత్రమే ఇప్పటివరకు పూర్తిచేసింది. మరో 14 వంతెనల పనులు నత్తనడకన సాగుతుండటంతో ఇప్పట్లో తమ కష్టాలు తీరేలా లేవని పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు పాదచారుల సౌకర్యార్థం దాదాపు 94 ప్రాంతాలలో పెడెస్టేరియన్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసింది. రోడ్డు దాటే సందర్భాలలో స్వయంగా పాదచారులే వీటిని ఉపయోగించుకొనే వెసులుబాటు ఉంటుంది. అయితే వీటిపై సరైన అవగాహాన లేకపోవడంతో వీటి వినియోగంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.హైదరాబాద్‌లోని దాదాపు అన్ని మెట్రో రైలు స్టేషన్‌ల వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసినప్పటికీ... దీనిని వినియోగించుకుంటున్న వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటోంది.
ఇవీ చదవండి: