వైద్యం కోసం వివిధ ప్రాంతాల నుంచి నగరంలోని ఆసుపత్రులకు వచ్చే రోగుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక, హోటళ్లలో తినేందుకు ఆర్థిక స్థోమత లేక ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారిని చూసి చలించిపోయిన ఓ వ్యక్తి.... నిత్యం వారి ఆకలి తీరుస్తున్నారు. రోగులతో పాటు వారి బంధువులకు కడుపునిండా అన్నం పెడుతున్నారు హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ కుమార్.
ఆసుపత్రుల్లో అన్నదానం
2009లో లార్డ్ వెల్ఫెర్ సంస్థను ఏర్పాటు చేసి అప్పటి నుంచి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకరోజు గాంధీ ఆసుప్రతి ముందు నుంచి వెళ్తూ ఉంటే... అన్నం కోసం ఇబ్బంది పడేవాళ్లను చూసి ఈ ఆలోచన వచ్చిందని సురేష్ అంటారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గాంధీ ఆసుపత్రి, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, నిమ్స్, నిలోఫర్, మెంటల్ ఆసుపత్రుల వద్ద ఉదయం పూట రోగుల బంధువులకు అన్నం పెడుతూ వారి ఆకలి తీరుస్తున్నాడు. తన ఇంటి వద్దే ఉదయం తయారు చేసుకుని 8 గంటల వరకు ఆసుపత్రులకు చేరుకుంటారు. ప్రతి రోజు ఉదయం పూట రోజుకు 250 వరకు మంది ఆకలి తీరుస్తున్నట్లు చెప్పారు.
రోగుల బంధువుల్లో సంతోషం
ఎన్నో ఇబ్బందులు పడి ఆసుపత్రికి వచ్చామని హైదరాబాద్‌లో అన్నం తినాలంటే వందల రూపాయలు కావాలని... కానీ ఇలాంటి వారు అన్నదానం చేసి తమ కడుపు నింపుతున్నారని రోగుల బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఎన్ని సంపాదించినా ఎవరు దానం చేయరని.. ఇలా అన్నదానం చేసే గుణం మంచిదంటున్నారు. అన్ని దానాలకన్నా...... అన్నదానం చాలా గొప్పదని వారికి రుణపడి ఉంటామంటున్నారు.
ప్రభుత్వం చేయూతనిస్తే:
స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికి... ప్రభుత్వం సహకారం అందిస్తే మరింత మందికి కడుపునింపే అవకాశం ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు.
ఇదీ చూడండి : గోదావరిలో వ్యర్థాల విడుదలపై సుమోటో కేసు నమోదు...