విశ్వవిద్యాలయాలలో బోధనతో పాటు.. పరిశోధనలు పెంచి.. విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. పాలమూరు, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ , ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌తో సమీక్షలు నిర్వహించారు.
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. కొవిడ్ అనంతర పరిస్థితులలో విద్యార్థుల ప్రయోజనాల కోసం భారీగా ఆన్లైన్ వనరులను సృష్టించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండేలా లైబ్రరీలను డిజిటలైజ్ చేయాలని గవర్నర్ సూచించారు. ఆన్లైన్ తరగతులకు సంబంధించిన వీడియో పాఠాలు, ఉపన్యాసాలు.. విశ్వవిద్యాలయం డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.
పూర్వ విద్యార్థులు విశ్వవిద్యాలయాల అభివృద్ధి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలు ఉద్యోగ ఆధారిత కోర్సుల ఏర్పాటుపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులకు మెరుగైన ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని.. నైపుణ్య ఆధారిత శిక్షణలు ఎంతో దోహదపడతాయన్నారు. విశ్వవిద్యాలయాలు పనితీరు మెరుగుపరచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించాల్సిన అవసరం ఉందని గవర్నర్ వివరించారు
ఇదీ చూడండీ : నర్సాపూర్ నుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమం: సీఎం