హైదరాబాద్ నగరంలో ఎన్నికలకు ముందు భారీ వర్షాలు, వరదల ప్రభావం ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వరద ప్రభావిత డివిజన్లలో తెరాస పైచేయి సాధించలేకపోగా ఆ ప్రాంతాల్లో భాజపా సత్తా చాటింది. భాజపా గెలిచిన పలుచోట్ల తెరాస సిట్టింగ్ కార్పొరేటర్లు ఓటమి చవిచూశారు. ప్రధానంగా 24 డివిజన్లపై వరద ప్రభావం అధికంగా కనిపించింది. 17 చోట్ల తెరాస సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది.
గత అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు హబ్సిగూడ, రామంతాపూర్, సుభాష్‌నగర్, మల్లాపూర్, ఏఎస్‌రావునగర్, జీడిమెట్ల, చంపాపేట, నాగోలు, సరూర్‌నగర్, గడ్డిఅన్నారం, చైతన్యపురి, హయత్‌నగర్, వనస్థలిపురం, లింగోజీగూడ, హస్తినాపురం, మన్సూరాబాద్, శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి, టోలిచౌక్, చాంద్రాయణగుట్ట, చిలుకానగర్, ఉప్పల్, నాచారం డివిజన్లలో వరద తాకిడికి జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. ఈ ప్రాంతాల్లోని 15 డివిజన్లలో కమలం వికసించింది. కేవలం 4 స్థానాల్లోనే తెరాస విజయాన్ని దక్కించుకుంది. 2 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. 3 స్థానాలను ఎంఐఎం కైవసం చేసుకుంది.
వరద బాధితులకు తోడ్పాటు అందించేందుకు సీఎం కేసీఆర్ రూ.600 కోట్ల వరద సహాయాన్ని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, తెరాస కార్పొరేటర్లు సాయం పంపిణీ, సహాయక చర్యల్లో పాల్గొనడంపై దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భంలో మినహా కార్పొరేటర్లు బాధితులను పట్టించుకోలేదని, కొందరు కార్పొరేటర్లు, తెరాస నాయకులు బాధితులకు రూ. 5 వేలు మాత్రమే అందించారని బాహాటంగానే విమర్శలు వ్యక్తమయ్యాయి.
వరద బాధిత డివిజన్లలో ఫలితాలు
భాజపా: చైతన్యపురి, హబ్సిగూడ, రామంతాపూర్, చంపాపేట, నాగోలు, సరూర్‌నగర్, గడ్డిఅన్నారం, హయత్‌నగర్, వనస్థలిపురం, లింగోజీగూడ, హస్తినాపురం, మన్సూరాబాద్, మైలార్‌దేవ్‌పల్లి, జీడిమెట్ల,
తెరాస: మల్లాపూర్, నాచారం, సుభాష్‌నగర్ చిలుకానగర్.
కాంగ్రెస్: ఉప్పల్, ఏఎస్‌రావునగర్.
ఎంఐఎం: చాంద్రాయణగుట్ట, టోలిచౌక్ శాస్త్రిపురం.
ఇదీ చూడండి: కారు జోరు ఎందుకు తగ్గింది?