మత్స్య సహకార సొసైటీ బ్యాంకు ఖాతాలోనే నగదు జమ చేయాలని తెలంగాణ మత్స్య కార్మిక సంఘం గత నాలుగు రోజులుగా చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని పలు పార్టీల నేతలకు లేఖలను అందజేశారు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ బెస్త. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ముషీరాబాద్ శాసన సభ్యుడు ముఠా గోపాల్లకు లేఖలు అందించామని పేర్కొన్నారు.
అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణలకు కూడా లేఖలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేతలంతా మత్స్యకార సంఘాలు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్య సొసైటీల ఖాతాల్లోనే నిధులు జమ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే చేప పిల్లల కొనుగోలుకు టెండర్లను రద్దు చేసి మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేస్తారని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముఠా విజయ్ కుమార్ బెస్త , సిద్దేశ్వర్, తెలంగాణ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుడబోయిన సాయిలు బెస్త , సంఘం రాష్ట్ర నాయకులు గంగధారి పూర్ణచందర్ బెస్త ,పారిపల్లి సంతోష్ బెస్త తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!