హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అగ్నిప్రమాదం జరిగింది. ఫుట్బాల్, టెన్నిస్ కోర్టు పక్కన చెత్త పేరుకుపోగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది... అధికారులకు వెంటనే తెలియజేశారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా... హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను పూర్తిగా ఆర్పేశారు. ఎవరైనా సిగరేట్ కాల్చేసి అక్కడ వేయటం వల్ల మంటలు చెలరేగాయని సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. చెత్త తీసుకెళ్లాలని చాలా రోజులుగా జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పిన్నప్పటికీ పట్టించుకోలేదని అధికారులు ఆరోపించారు. సకాలంలో సిబ్బంది స్పందించటం వల్ల పెద్ద నష్టమేమీ జరగలేదని తెలిపారు.