కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే జాలేస్తుందని.. రోజు రోజుకూ దిగజారిపోతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ముఖర్జీ మాటలు తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా వర్తిస్తాయని తెలిపారు. మొన్నటి వరకు పౌరసత్వ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్.. అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు రూ. 75 వేలు ఇస్తే.. భాజపా రూ. ఏడు లక్షలకు పెంచిందన్నారు. కాంగ్రెస్ వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని లక్ష్మణ్ ఆరోపించారు.
మోదీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలబడుతోందని వివరించారు. అప్పట్లో వాయిపేయి ప్రభుత్వం వారి రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించిందన్నారు. కేకే తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం లేదని రాజ్యసభ సెక్రటరియేట్ లేఖ పంపిందన్నారు. తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై న్యాయస్థానంలో పోరాడతామని లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : గడ్డిఅన్నారం మార్కెట్ యార్డు.. కోహెడకు తరలింపు