Farmers Handcuffs Incident in Telangana : రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలంటూ గత నెల 30న యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న పలువురు రైతులు, రాజకీయ పార్టీల నేతలను అదే రోజు రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన, మంత్రి కాన్వాయ్‌కు అడ్డుపడిన వ్యవహారంలో.. పల్లెర్ల యాదగిరి, గడ్డమీది మల్లేశం, మల్లబోయిన బాలనర్సింహ, అభిశెట్టి నిఖిల్, కాంగ్రెస్ నేత రవికుమార్, బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నలుగురు రైతులను రిమాండ్‌కు తరలించారు.
Handcuffs To Farmers in Yadadri : 14రోజుల పాటు నల్గొండ జైల్లో ఉన్న ఈ నలుగురి రిమాండ్ గడువు పొడిగించాలంటూ ఈనెల 13వ తేదీన.. పోలీసులు వారిని భువనగిరి కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. నలుగురిని న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం, తిరిగి జైలుకు తరలించే క్రమంలో వారికి సంకెళ్లు వేసి, వాహనంలోకి ఎక్కించారు. రైతులకు బేడీలు వేసి తీసుకువెళ్లటంపై అక్కడే ఉన్న బాధిత కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Opposition Leaders Respond on Farmers Handcuff issue : రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఖండించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి మాత్రమే బేడీలు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా.. మామూలు రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు శోఛనీయమన్నారు. బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకుని, రైతులకు న్యాయం చేయాలన్నారు. భూసేకరణను వ్యతిరేకించిన రైతులకు.. పోలీసులు బేడీలు వేయడంపై కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేసిన అన్నదాతల్ని కోర్టుకు తీసుకు వస్తున్నప్పుడు సంకెళ్లు వేయడం దారుణమని.. బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"రైతులకు బేడీలు వేయడం వల్ల తెలంగాణ ప్రజలందరూ ఈరోజు కన్నీరు పెట్టుకున్నారు. ఇది మంచి పరిపాలన కాదు. బేడీలు వేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. వారి భూమి ఎలాంటి వివాదాలు లేకుండా తిరిగి వారికి ఇచ్చాయాలని కోరుతున్నాను."- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ
రైతులంటే కేసీఆర్‌కు చులకనెందుకు : రౌడీలు, దొంగల్లాగా రైతుల పట్ల వ్యవహరించిన కేసీఆర్ సర్కార్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. భూములు కోల్పోయిన పేద రైతులంటే కేసీఆర్‌కు చులకనెందుకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తే బేడీలు వేసి, జైళ్లో వేస్తారా అని నిలదీశారు. అన్నం పెట్టే భూమిపుత్రులకు అత్యుత్సాహంతో పోలీసులు బేడీలు వేసి అవమానించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకోకపోతే రైతుల తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
అరెస్టు చేసిన వారిలో రైతులే లేరు : రైతులకు సంకెళ్లపై రాజకీయ దుమారం చెలరేగటంతో భువనగిరి డీసీపీ రాజేశ్‌చంద్ర వివరణ ఇచ్చారు. తాము అరెస్టు చేసిన వారిలో రైతులే లేరని ఆయన తెలిపారు. నలుగురు వ్యక్తులు పోలీసు వాహనాలు ధ్వంసం చేయటంతో పాటు కలెక్టరేట్ వద్ద గడ్డివామును దగ్ధం చేశారని డీసీపీ చెప్పారు. కోర్టుకు వచ్చే సమయంలోనూ వారు ఇబ్బంది పెట్టినట్లు చెప్పారు. వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపి, అవసరమైతే బందోబస్తు బాధ్యుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. మరోపక్క.. ఆందోళన కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురు రైతులు బెయిల్‌పై విడదలయ్యారు. భువనగిరిలో వీరికి డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
ఇవీ చదవండి :