High Level Committee Inquiry Falaknuma Express Fire Accident : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై హై లెవల్ కమిటీ విచారణ ప్రారంభమైంది. సికింద్రాబాద్లోని రైల్వే సంచాలన్ భవన్లో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి విచారణ కమిటీ అవసరమైన వివరాలను సేకరిస్తోంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ప్రమాదంపై వివరాలను అధికారులు సేకరించనున్నారు. ఫలక్‌నుమా ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగడం ప్రమాదమా..? కుట్ర కోణమా..? అనే దానిపై ఆరాతీస్తున్నారు.
మరోవైపు ఈ ప్రమాదంలో సామగ్రి, విలువైన వస్తువులు కోల్పోయిన ప్రయాణికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాద ఘటన గుంటూరు డివిజన్ పరిధిలోకి రావడంతో.. ఆ రైల్వే డివిజన్ అధికారులు విచారణ చేపడుతున్నారు. సికింద్రాబాద్లోని రైల్వే సంచాలన్ భవన్లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై మెకానికల్, లోకో డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్, భద్రత విభాగాలు వివరాలు సేకరిస్తున్నాయి. ప్రత్యక్షసాక్షులు, అనుమానం ఉన్నవారి నుంచి ముఖ్య భద్రతా అధికారి, చీఫ్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసెస్ మేనేజర్ , ఇతర ఉన్నతాధికారులు సంఘటన వివరాలు సేకరిస్తున్నారు.
అసలేం జరిగిందంటే. : హావ్ డా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఈ విషయాన్ని గుర్తించిన.. రైల్వే సిబ్బంది రైలును నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. ఈ ఘటనలో ఐదు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ క్రమంలోనే మరిన్ని బోగీలకు మంటలు వ్యాపించకుండా ఉండేందుకు.. సిబ్బంది వాటిని ఆ బోగీల నుంచి విడదీసి.. మంటలు వ్యాపించకుండా ముందుగా జాగ్రత్తపడ్డారు.
Falaknuma Express Fire Accident : ఈ ప్రమాదంలో ఎస్4, ఎస్5, ఎస్6 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వివిధ చోట్ల నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పించి.. అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని.. ఎలాంటి గాయాలు కాకపోవడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత మిగిలిన బోగీలతో కలిసి రైలును సికింద్రాబాద్‌కు తీసుకొచ్చారు. మరోవైపు ప్రత్యేక బస్సుల్లో ఘటనా స్థలం నుంచి ప్రయాణికులను సికింద్రాబాద్‌కు తరలించారు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రయాణికులు పేర్కొన్నారు.
Fire Accident in Falaknuma Express : అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. ఒడిశా ప్రమాదం జరిగిన తర్వాత కూడా భద్రతా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో బ్యాగులు కాలిపోయాయని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశామని వాపోయారు. ఈ క్రమంలోనే నగదు, సామగ్రి కోల్పోయామని కొందరు ప్రయాణికులు వివరించారు. ఈ ఘటనతో రైల్వేకు రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇవీ చదవండి :