Fake profiles in matrimonial websites : విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న మ్యారేజ్ బ్యూరోల్లో.. కొందరు అత్యాశతో తప్పుడు వివరాలు పొందుపరుస్తున్నారు. వీటిపై ప్రభుత్వపరమైన నియంత్రణ లేదు. మ్యారేజ్‌బ్యూరోలు వాటి సంపాదనపై ప్రభుత్వానికి చెల్లించాల్సిన 18 శాతం జీఎస్టీని కూడా నిర్వాహకులు ఎగవేస్తున్నారని వాణిజ్య పన్నులశాఖ వర్గాలు తెలిపాయి. బ్యూరోల్లో ఇచ్చే వధూవరుల వివరాల్లో చాలా వరకు తప్పుడు సమాచారం ఉంటోంది.
matrimonial frauds in Telangana : ఒక బ్యూరోలో ఇచ్చిన వివరాలు మరికొందరికి వ్యాప్తి చెందుతూ గందరగోళానికి, మోసాలకు కారణమవుతోంది. ఐఐటీలో చదివారు, అమెరికాలో ఉద్యోగం, నెలకు రూ.లక్షల వేతనం, హైదరాబాద్‌లో లగ్జరీ ఫ్లాట్.. మెదలగు ఆకర్షణీయ వివరాలు చూసి మోసపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఒకటికి పదిసార్లు బాగా విచారణ చేసుకున్నాకే తల్లిదండ్రులు పిల్లల పెళ్లిపై నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.
ఎస్సైకే టోకరా.. ఆయన ఒక ఎస్సై. తన కుమారుడికి పెళ్లి సంబంధాలు వెతుకుతూ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ మ్యారేజ్‌బ్యూరోలో వివరాలిచ్చారు. నాలుగు రోజుల తరువాత తిరుపతిలోని మ్యారేజ్ బ్యూరో నుంచి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయికి సరిపడే ప్రొఫైల్స్ పంపుతామని చెప్పారు. నెలకు రూ.లక్ష వేతనం పొందుతున్న అమ్మాయి ఉందని, ఆమె తండ్రితో మాట్లాడమని కాన్ఫరెన్స్ కాల్ కలిపింది. అనంతరం ఎస్సై.. వధువు తండ్రి ఫోన్ నంబరు, చిరునామా అడిగారు. అందుకోసం రూ.15 వేలు ఇవ్వాలని బ్యూరో కోరడంతో ఆయన వెంటనే ఆన్‌లైన్ ద్వారా చెల్లించారు. తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని ఎస్సైకి అర్థమైంది.
మారిన ధోరణి.. సొంత ఇల్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, మంచి అందం, కొద్దో గొప్పో ఆస్తి ఉన్న అబ్బాయిలకే నేడు డిమాండ్ ఉంది. దీంతో కొందరు అబ్బాయిల తల్లిదండ్రులు తప్పుడు సమాచారం పొందుపరిచి.. ఏదోలా పెళ్లి అయితే చాలని ప్రయత్నిస్తున్నారు. వధూవరులకు సంబంధించి తప్పుడు వివరాలిస్తే.. నిజానిజాలు తమకు తెలిసే అవకాశం లేదని.. వారే స్వయంగా విచారణ చేసుకుని సంబంధం కుదుర్చుకోవాల్సి ఉంటుందని ఒక బ్యూరో ప్రతినిధి తెలిపారు.
ఎన్నారై, అమెరికా సంబంధాలు మరింత దారుణంగా ఉంటున్నాయని హైదరాబాద్‌లోని మ్యారేజ్‌బ్యూరోకి చెందిన సీనియర్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అమెరికాలో ఉండే కొందరు అబ్బాయిలు అక్కడి యువతితో సహజీవనం చేయడం లేదా పెళ్లి చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి.. తల్లిదండ్రుల ఒత్తిడితో ఇక్కడికి వచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. భర్త వెంట అమెరికా వెళ్లిన కొత్త పెళ్లికూతురికి కొద్దిరోజులకే ఈ విషయం అర్థమై దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోందని తెలిపారు.
ఎంబీఏ, మెడిసిన్, ఎంటెక్, వంటి ఉన్నత చదువులు చదివిన వారికి అదేస్థాయి అమ్మాయి లేదా అబ్బాయి తేలిగ్గా దొరకడం లేదు. వీరిని ఆకట్టుకోవాలని కొన్ని బ్యూరోల వారు నకిలీ ప్రొఫైల్స్ ఇస్తున్నారు. అబ్బాయికున్న ఆస్తి లేదా అమ్మాయికిచ్చే కట్నం విలువలో 2 నుంచి 3 శాతం కనీసం ఒక శాతమైనా కమీషన్ ఇవ్వాలని పలు మ్యారేజ్‌బ్యూరోలు నిబంధనలు పెడుతున్నాయి. ఈ సొమ్ము ఇవ్వకపోతే పెళ్లి తరువాత కూడా గొడవలకు దిగుతున్నాయి.
ఆన్‌లైన్ గ్రూపుల్లో సంబంధాలు.. ఇటీవలి కాలంలో వివిధ సామాజికవర్గాల వారు ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో తమ బంధువులు, మిత్రులతో ‘మ్యారేజ్‌గ్రూప్’ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో తల్లిదండ్రులు తమ ఫోన్ నంబరు, పిల్లల వివరాలు పోస్టు చేస్తే ఆసక్తి ఉన్న ఇతరులు వారిని నేరుగా సంప్రదిస్తున్నారు. దీనివల్ల మ్యారేజ్‌బ్యూరోల బెడద కొంత మేర తప్పుతోంది. ఇలా వాట్సాప్ గ్రూప్‌లు, ఆన్‌లైన్ పోర్టళ్లలో ఉన్న వధూవరుల ప్రొఫెల్స్, ఫోన్ నంబర్లు తస్కరించి.. వాటిని ఇతరులకు చూపి రుసుం వసూలు చేసే మ్యారేజ్ బ్యూరోలు కూడా లేకపోలేదు.
ఇవీ చదవండి: