Fake Baba Social Service Fraud Hyderabad : ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటూ.. వృద్ధాశ్రమాలు, గోశాలలు, నైట్ షెల్టర్‌లు మొదలగు సామాజిక కార్యక్రమాల ముసుగుతో జనంలో చలామణి అయ్యాడు. తాను చేస్తున్న వ్యాపారంలో.. వస్తున్న లాభాలతో ఈ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నమ్మబలికాడు. తన వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానంటూ.. నమ్మించి కోట్లు కూడబెట్టాడు. ఏకంగా ఇలా 30 కోట్ల రూపాయలకు పైగా డబ్బు వసూలు చేసి ఉడాయించాడు.
'మాయా అద్దం'.. మోసపోయిన 72 ఏళ్ల వృద్ధుడు.. వారిని నగ్నంగా చూడొచ్చని రూ.9 లక్షలు వసూలు
ఇదీ హైదరాబాద్లోని సేవ పేరుతో మోసం చేసిన.. నకిలీ ఆధ్యాత్మిక గురువు బాగోతం. వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానంటూ రూ.34.34 కోట్ల మేర వసూలు చేసి మూడేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు సీఐడీ అదనపు డీజీ మహేష్ భగవత్ మంగళవారం పేర్కొన్నారు.
Fake Baba Arrested for Cheating Hyderabad : కొత్తపేట, ఆర్కేపురం ప్రాంతానికి చెందిన ముద్దూరు ఉమాశంకర్.. తానొక ఆధ్యాత్మిక గురువునని, సంఘసేవ చేస్తున్నానంటూ.. జనంలో ప్రచారం చేసుకునేవాడు. ‘అవర్ ప్లేస్’ పేరుతో వృద్ధాశ్రమాలు, గోశాలలు, నైట్ షెల్టర్‌లు నిర్మించి నిర్వహించడంతో పాటు పేద పిల్లలు చదువుకునేందుకు కూడా ఆర్థికసాయం చేస్తున్నానంటూ చెప్పేవాడు. తాను చేస్తున్న వ్యాపారంలో వచ్చిన లాభాలతోనే ఇదంతా చేస్తున్నానని నమ్మించేవాడు.
పాపం పండింది... ఆ దొంగబాబా ఇలా బుక్కయ్యాడు!
ముద్దూరు ఉమాశంకర్ తన వ్యాపారంలో వాటా ఇస్తానంటూ.. ఇతరుల నుంచి డబ్బు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఇలా 2006 నుంచి రూ.30 కోట్లకు పైగా డబ్బు వసూలు చేశాడు. ఇతని మోసాలపై అస్మాన్‌ఘాట్, టీవీ టవర్ ప్రాంతానికి చెందిన సాధజన్ గిరీష్ ప్రసాద్ 2015లోనే చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సంవత్సరం నవంబరు నెలలో హైదరాబాద్ సీసీఎస్‌తోపాటు చైతన్యపురి పోలీస్‌స్టేషన్లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం కేసుల్లో ఉమాశంకర్ రూ.34.34 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. తదనంతరం ఈ మూడు కేసులూ సీఐడీకి బదిలీ చేశారు.
2020 నుంచి నిందితుడు ఉమాశంకర్ పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చేపట్టారు. అతనిపై రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. సీఐడీ అదనపు డీజీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు ఉమాశంకర్ ఆచూకీ తెలుసుకునేందుకు.. సీఐడీ ఎస్పీ రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. నిందితుడు కొంపల్లిలో ఉన్నట్లు అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు.