స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పునర్ వ్యవస్థీకరణపై ఆ శాఖ ఉన్నతాధికారులు నాలుగు రోజులపాటు చేసిన కసరత్తులో సత్తా లేదని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కొత్త రెవెన్యూ చట్టం అమలుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల శాఖ పునర్ వ్యవస్థీకరణ ఉండాలని దిశానిర్దేశం చేసింది. మంగళవారం సాయంత్రం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమాలోచన జరిపారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా రిజిస్ట్రేషన్ల సంఖ్య, రెవెన్యూ, అక్కడ పని చేస్తున్న సిబ్బంది తదితర వివరాలతోపాటు ఎక్కడెక్కడ అదనంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి లాంటి అంశాలు అడిగి తెలుసుకున్నారు. ఈ శాఖ అధికారులు నివేదించిన వివరాలతో సంతృప్తి చెందని సీఎస్.. సమగ్ర వివరాలతో మరోసారి రావాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ చిరంజీవులును ఆదేశించినట్లు తెలుస్తోంది.
రెవెన్యూ పరిధిలోకి
వాస్తవానికి కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి రావడం వల్ల.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ అంతా రెవెన్యూ పరిధిలోకి వెళ్తోంది. వాటి సమగ్ర వివరాలు ఉన్నట్లయితే.. ఎక్కడెక్కడ వ్యవసాయ భూములు అధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయో అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎత్తివేస్తారు. ఎక్కడ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరిగి ఆదాయం ఎక్కువ వస్తుందో గుర్తిస్తారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మొత్తం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 23 రద్దు అయ్యేందుకు అవకాశం ఉండగా.. మరో 21 చోట్ల కొత్తగా ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
జిల్లాల్లో అధికంగా
ఉమ్మడి జిల్లాల వారీగా అదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్, బోథ్, లక్సెట్టిపేట్, నిజామాబాద్ జిల్లాల్లో బిచ్కుంద, దోమకొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో అలంపూర్, మరొకటి, వరంగల్ జిల్లాల్లో కొడకండ్ల, స్టేషన్‌ఘన్‌పూర్, ములుగు, వర్దన్నపేట ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో బూర్గంపాడు, ఇల్లెందు, కల్లూరు, కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్, మల్యాల, నల్గొండ జిల్లాల్లో నిడమనూరు, చండూరు, మోత్కూరు, రామన్నపేట ఉన్నట్లు తెలిసింది.
ఇక సిద్దిపేట రూరల్, జోగిపేట, నర్సాపూర్, హుస్నాబాద్‌లల్లో మూడు రద్దుయ్యేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాలలో ఒకటి, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో ఒకొటి, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్‌లలో కొత్తగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇవి కాకుండా ఎక్కువ ఒత్తిడి, ఆదాయం ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అధికంగా అదనపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నెలాఖరులోగా
వాణిజ్య పన్నుల శాఖ పునర్ వ్యవస్థీకరణతో రిజిస్ట్రేషన్ల శాఖపై ప్రభుత్వం దృష్టి సారించింది. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో ముందుకెళ్తోంది. రెవెన్యూ శాఖ మండల కార్యాలయాలకు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేయాల్సిన సాంకేతికపరమైన పనులు వేగవంతం చేశారు. గతంలో కొత్త పోస్టుల మంజూరు కోసం రిజిస్ట్రేషన్ శాఖ పంపిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి : 'యాజమాన్య భయం': జీహెచ్ఎంసీలో మ్యుటేషన్లకు బ్రేక్