TSRTC BILL LATEST UPDATES : ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై అనేక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్టీసీ విభజన, కార్మికుల జీతభత్యాలు, పింఛన్లు, ఉద్యోగ భద్రత వంటి 5 ప్రధాన అంశాలపై రాజ్‌భవన్ సందేహాలు లేవనెత్తగా.. సీఎస్ శాంతికుమారి వివరంగా లేఖ రాశారు. దానిపై సంతృప్తి చెందని గవర్నర్.. మరో 6 అంశాలపై అదనపు సమాచారం కోరారు. వాటి వివరాలతో కూడిన లేఖను విడుదల చేసిన రాజ్‌భవన్.. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాలవాంఛను రాజ్‌భవన్ అడ్డుకోవడం లేదని, వారికి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రక్రియను పూర్తి చేయడానికే గవర్నర్ తదుపరి వివరణను కోరారని పేర్కొంది. గవర్నర్ తాజా లేఖకూ శనివారం సాయంత్రమే సీఎస్ సమాధానమిచ్చారు.
TSRTC Bill Controversy : తొలుత 5 ప్రధాన అంశాలపై వివరణ.. తర్వాత మళ్లీ 6 అంశాలపై అదనపు సమాచారం కావాలని గవర్నర్ కోరారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణలో కేంద్రం వాటా 30 శాతం ఉందని పేర్కొన్నందున విలీనానికి కేంద్రం అనుమతి తీసుకున్నారా? తీసుకుని ఉంటే సంబంధిత కాపీని పంపగలరని కోరారు. తీసుకోకుంటే న్యాయపరమైన చిక్కులను పరిష్కరించడానికి తీసుకొన్న చర్యలను వివరించాలని తెలిపారు. ఆర్టీసీలో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలు ఇవ్వాలన్న రాజ్‌భవన్.. శాశ్వత ఉద్యోగులు మినహా మిగిలిన వారి విషయంలో చట్టపరంగా తీసుకోనున్న చర్యలు ఏంటని ప్రశ్నించారు. కార్పొరేషన్‌కు సంబంధించిన చర, స్థిరాస్తులు అలాగే కొనసాగుతాయా? లేదా చెప్పాలని వివరణ కోరారు. కొనసాగకుంటే తెలంగాణ ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుందా చెప్పాలన్నారు. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే వారి బాధ్యతలను నియంత్రించే అధికారం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. ఉద్యోగులను ప్రభుత్వంలో కలుపుకున్న తర్వాత వీరంతా కార్పొరేషన్లో డిప్యుటేషన్‌పై పని చేస్తారా? లేక వేరే ఏర్పాటు ఏదైనా ఉందా అంటూ వివరణ కోరారు.
వారంతా అలాగే కొనసాగుతారు..: గవర్నర్ కోరిన 6 అంశాలపై ప్రభుత్వం తక్షణమే వివరణ ఇచ్చింది. బిల్లు లక్ష్యాల్లో పేర్కొన్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక కార్పొరేషన్ అని.. దీని కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో విలీనమవుతారని.. ఆస్తులు, అప్పులు అన్నీ కార్పొరేషన్‌కే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రతిపాదిత బిల్లులో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కు తీసుకోవడం లేదని పేర్కొంది. ఏపీఎస్ఆర్టీసీ విభజన ఇంకా పెండింగ్‌లో ఉంది కాబట్టి.. ఈ దశలో ప్రస్తుత బిల్లు కోసం కేంద్రం ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. కేటగిరీ, డిపోల వారీగా శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల జాబితాను లేఖకు జత చేస్తున్నామని.. నాన్ పర్మినెంట్ ఎంప్లాయీస్ ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగుతారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ విభజన ఇంకా కేంద్రం వద్ద ఉన్నందున.. కార్పొరేషన్ స్థిర, చరాస్థులు టీఎస్ఆర్టీసీకే ఉంటాయని స్పష్టత ఇచ్చింది.
చట్టానికి తగ్గట్లుగా రూల్స్ తయార చేస్తాం..: ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకొన్నా, చట్టానికి తగ్గట్లుగా ప్రభుత్వం రూల్స్‌ను తయారు చేస్తుందని తెలిపింది. రోజువారీ కార్యక్రమాలకు, స్థిర, చరాస్తులకు సహా టీఎస్ఆర్టీసీ బోర్డు డైరెక్టర్లే బాధ్యులుగా ఉంటారని.. ఉద్యోగులు, ప్రజల ప్రయోజనాలను కాపాడటమే బిల్లు లక్ష్యమని తెలిపింది. ప్రభుత్వంలో విలీనం తర్వాత టీఎస్ఆర్టీసీ ఎండీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలోనే ఉద్యోగుల కార్యకలాపాలు ఉంటాయని.. జీతాలు, అలవెన్సులు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తామని తెలిపింది. ముసాయిదా బిల్లును ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి వీలుగా సిఫార్సు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. దీనిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది.
BJP Supports TSRTC Bill : "ఆర్టీసీ బిల్లును బీజేపీ స్వాగతిస్తోంది.. మాపై అసత్య ప్రచారాలొద్దు"