గుడుంబా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. అవసరమైతే పీడీ చట్టాన్ని ఉపయోగించి కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎక్సైజ్‌శాఖ అధికారులతో మంత్రి దూరదృశ్య సమీక్షను నిర్వహించారు. జిల్లాల వారీగా గుడుంబా తయారీదారులపై తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. గతంలో గుడుంబాపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి పునరావాసం కల్పించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 6,299 మందికి రూ.126 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
లాక్డౌన్ వల్ల మద్యం సేవించే కొందరు గుడుంబా వైపు మళ్లినట్లు మంత్రి పేర్కొన్నారు. అదిలాబాద్, వరంగల్ రూరల్, మహబుబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని మారుమూల తండాలలో... గుడుంబా తయారీదారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. బెల్లం సరఫరా చేస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి శాఖ గౌరవాన్ని పెంచాలన్నారు. ఎక్కడైనా మద్యానికి సంబంధించి వార్తలు మీడియాలో వస్తే ఆ ప్రాంత అధికారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్