అందం అంటేనే గులాబీలు.. గులాబీలంటేనే అందం. సహజంగా పూలంటే ఆడవాళ్లకు మాత్రమే మక్కువ అంటారు. గులాబీని ఇష్టపడని వారుండరు. చిన్నా,పెద్ద తేడా లేకుండా పూలను చూడగానే ఓ రకమైన మధురానుభూతి పొందుతారు. రంగురంగుల్లో విరిసిన పూల సోయగాలను ఒకే చోట చూస్తే నయనానందమే. హరివిల్లు రంగులు అద్దుకుని పూచే గులాబీ అందానికి ఎవరైనా గులాం కావాల్సిందే.
ఒకే చోట 300 గులాబీలు
ఒకే చోట మూడు వందల రకాల పూవ్వులు కొలువుదీరితే చూడటానికి రెండుకళ్లు చాలవు. అందులోనూ ఎన్నెన్నో వర్ణాల పూలు ముసి ముసి నవ్వులతో ఆకట్టుకుంటున్నాయి. ఆ పూల సోయగాలను చూస్తుంటే.. మనస్సు ఆహ్లదంతో తేలిపోతుంది. ప్రకృతి ప్రేమికులను ఈ గులాబీ ప్రదర్శన కట్టిపడేస్తోంది.
ఈ కథనం చదవండి: అవును.. ఈ పువ్వులు వాడిపోవు
మార్కెట్ ఎక్కువే
వేడుకలకే వెలుగుగా మారుతున్న గులాబీ అందాలను చూస్తే చాలు... మనసు పులకరించిపోతోందంటున్నారు సందర్శకులు. ఎర్ర గులాబీలు ప్రేమకు చిహ్నంగా చెబుతుంటారు. మనసులోని భావాలను వ్యక్తపరచాలంటే ఓ రోజాను ఇస్తే సరిపోతుందంటారు యువత. ఇక ప్రేమికుల రోజు యువతి యువకులు ప్రేమను వ్యక్తపరిచేందుకు ఈ పూలనే ఇస్తారు. ఇంకా చెప్పాలంటే ప్రేమికుల రోజు గులాబీల మార్కెట్ ఎక్కువే.
సంతోషానికి ప్రతీక
గులాబీల్లో అరుదైన పువ్వులూ ఉంటాయి. బ్లూ, బ్లాక్, క్రీం రోజాలు కాస్త అరుదు. సున్నితత్వానికి గుర్తుగా, సంతోషానికి ప్రతీకగా గులాబీని చెప్పవచ్చు. ప్రతివ్యక్తి జీవితంలో కష్టం వస్తుంది. ఆ కష్టం గులాబీ కింద ఉండే ముల్లు లాంటింది. ఆ ఇబ్బందులను దాటి ముందుకెళ్తే అందమైన గులాబీ కనిపిస్తుంది.
మొదటి ప్రాధాన్యత దీనికే
సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు మన చిత్రాలను ప్రొఫైల్ పిక్‌లుగా పెట్టుకుంటున్నాము. పదేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లలో ప్రొఫైల్ చిత్రాలకు గులాబీలు మాత్రమే వాడేవారు. ఎవరైనా ఒక మొక్క పెంచుకోవాలంటే మాత్రం మొదటి ప్రాధాన్యత గులాబీకే.
మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే గులాబీలు... రోజ్ టీ రూపంలో ఆరోగ్యాన్నీ కాపాడుతాయని అంటారు నిపుణులు. అందుకే రోజాను పువ్వుల్లో రాణి(క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్)గా అభివర్ణిస్తారు.
ఈ కథనం చదవండి: మగువల మనసు దోచే గాజులు