రాబోయే కాలం ఎలక్ట్రిక్ యుగమని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో రెండు రోజులు జరిగే విద్యుత్ వాహనాల ప్రదర్శన(ఈవీ ట్రేడ్ ఈటో ఎక్స్‌పో)ను ఆయన ప్రారంభించారు. జాతీయ రహదారులపై ప్రతి 25 కిలో మీటర్లకు ఒక విద్యుత్తు ఛార్జింగ్ స్టేషన్(electric charging stations) ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రైవేటు సంస్థలతో కలసి టీఎస్ రెడ్కో రానున్న రోజుల్లో 600 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిందన్నారు. ఇప్పటికే 138 స్టేషన్లకు అనుమతి ఇచ్చి ప్రారంభించామన్నారు. 10 వేల ద్విచక్ర విద్యుత్తు వాహనాల వాడకంతో ఏడాదిలో రూ.250 కోట్లను ఆదా చేయవచ్చన్నారు. మొదట కొనే వాహనదారులకు పన్ను రద్దుతో పాటు తయారీ సంస్థలు, బ్యాటరీ, ఛార్జింగ్ ఉత్పత్తి సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇటీవల విద్యుత్ వాహనం తీసుకున్నారని.. స్వయంగా నడిపి చూశారని చెప్పారు. తాను సైతం మరోసంస్థ కారును నడిపి చూశానన్నారు. ఇంటిపై సౌర విద్యుత్తు ఏర్పాటు చేసుకుంటే వాహనాల ఛార్జింగ్‌కు అసలు ఖర్చే ఉండదని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ తెలిపారు. 600 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో రాబోయే రెండు నెలల్లో 150 ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ రెడ్కో ఎండీ జానయ్య పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ శంకరయ్య, నిర్వాహకులు మనోజ్ పాల్గొన్నారు. ప్రదర్శనలో పలు సంస్థలు విద్యుత్‌తో నడిచే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్లను ప్రదర్శించాయి.
ఇదీ చదవండి: Global Ignite 2021: 'ఇంటర్నెట్ మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది'