ED Investigation on Casino Case: క్యాసినో కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం ఈడీ ఎదుట మంత్రి తలసాని వ్యక్తిగత సహాయకుడు హరీశ్‌తో పాటు డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి, వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి హాజరయ్యారు. దాదాపు మంత్రి తలసాని పీఏ హరీశ్‌ను ఈడీ... 7 గంటలపాటు విచారించింది. హరీశ్ బ్యాంక్ ఖాతా వివరాలను ఈడీ అధికారులు పరీశీలిస్తున్నారు. ఇక వ్యాపారవేత్త బుచ్చిరెడ్డిని దాదాపు 5 గంటలపాటు విచారణ చేపట్టింది. మే, జూన్‌లో నేపాల్‌లో జరిగిన ఈవెంట్లపై ఈడీ అధికారులు ప్రశ్నించారు.
గుడివాడలో జరిగిన క్యాసినో వ్యవహారంపైనా ఈడీ ఆయన్ని ప్రశ్నించింది. బుచ్చిరెడ్డి సమర్పించిన ఆరేళ్ల బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్‌పై బుచ్చిరెడ్డిని ఈడీ ప్రశ్నించింది. గుడివాడ, నేపాల్‌లో క్యాసినో ఈవెంట్లలో భాగస్వామ్యంపై ఈడీ ప్రశ్నలు అడిగింది. ఎల్లుండి మళ్లీ విచారణకు రావాలని బుచ్చిరెడ్డికి చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. విచారణకు అనంతరం అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ ఎల్.రమణ ఆసుపత్రిలో చేరారు.
తలసాని మహేశ్, ధర్మేంద్ర యాదవ్ విచారణకు హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానమిచ్చారు. గ్రానైట్ కంపెనీల కేసులోనూ పలువురు యజమానులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. విదేశాలకు గ్రానైట్ ఎగుమతులు, అవకతవకలపై ఆరా తీయనున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనలు, హవాలా నగదు చెల్లింపులపై దర్యాప్తులో నిజానిజాలు నిగ్గుతేల్చనున్నారు.
ఇవీ చదవండి: