ED Investigation in ESI Scam Latest Updates : హైదరాబాద్‌లో బీమా వైద్య సేవల కుంభకోణంలో (ESI Scam) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మాజీ అధికారులు, గుత్తేదారులను.. ఈడీ మరోసారి కార్యాలయానికి పిలిచి ప్రశ్నించింది. ఈ స్కామ్‌కు సంబంధించి రెండేళ్ల క్రితం మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక శాఖాధికారుల ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ESI Scam in Hyderabad : ఈ క్రమంలోనే 2021 ఏప్రిల్‌లో.. ఈడీ (ED) అధికారులు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. అప్పటి కార్మిక శాఖ మంత్రి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి ముకుంద రెడ్డి ఇళ్లలో తనిఖీలు చేశారు. ఇందులో భాగంగానే రూ.3 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం, ఇళ్ల స్థలాల పత్రాలు, ఖాళీ చెక్కులు, బ్యాంకు లాకర్ల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బీమా వైద్య సేవల విభాగానికి చెందిన డైరెక్టర్, అదనపు డైరెక్టర్, ఇతర అధికారుల ఇళ్లల్లోనూ దాడులు జరిపారు.
ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో నిందితుల సస్పెన్షన్ కొనసాగింపు
ఈ కేసులో మొత్తం రూ. 144 కోట్లు విలువ చేసే ఆస్తులను.. ఈడీ అధికారులు ఇప్పటికే అటాచ్ చేశారు. ఓమ్ని హెల్త్‌కేర్ కంపెనీ యజమాని శ్రీహరికి చెందిన రూ.119 కోట్లు, తేజ ఫార్మాకు చెందిన రాజేశ్వర్ రెడ్డికి చెందిన రూ.4 కోట్లు, బీమా వైద్య సేవల విభాగం మాజీ సంచాలకురాలు దేవికారాణికి చెందిన రూ.17 కోట్లు, అధికారులు నాగలక్ష్మికి చెందిన రూ.2.4 కోట్లు, పద్మకు చెందిన రూ.74 లక్షల ఆస్తులను అటాచ్ చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తులో తేలింది.
ఈఎస్ఐ కుంభకోణం కేసులో ముమ్మరంగా దర్యాప్తు
ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు మందుల సరఫరాలో భారీకుంభకోణం జరిగినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. 2015నుంచి 2019 వరకు జరిగిన కొనుగోళ్లలో 200 కోట్లకు పైగా మోసం జరిగినట్లు గుర్తించారు. కేసుతో సంబంధం ఉన్న అధికారులను, గుత్తేదారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్లందరూ బెయిల్‌పై ఉన్నారు.
ఇటీవలే ఈఎస్‌ఐ కుంభకోణంలో ఓమ్నిహెల్త్‌కేర్ అధినేత కంచర్ల సుజాతపై.. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ.. ఈఎస్‌ఐ కేసులో 7వ నిందితురాలిగా ఉన్న సుజాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ కె.సురేందర్ తీర్పును వెలువరించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.నవీన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ ఎఫ్‌ఐఆర్‌లో పిటిషనర్ సుజాత ప్రధాన నిందితుడు కె.శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ భార్య అని మాత్రమే ఏసీబీ పేర్కొందని వివరించారు.
కేవలం సహకరించారని ఆరోపణ తప్ప ఎలాంటి ఆధారాలు చూపలేదని న్యాయస్థానానికి ఎన్.నవీన్‌కుమార్ తెలిపారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ.. ప్రధాన నిందితుడైన తన భర్తకు సహకరించారన్న ఆరోపణ తప్ప.. అందులో పిటిషనర్ పాత్ర గురించి ఎలాంటి ప్రస్తావన లేదని పేర్కొన్నారు. డైరెక్టర్ ఐఎంఎస్‌తో సుజాత కనీసం ఒక్క లావాదేవీ జరిపినట్లుగా కూడా ఆధారం లేదని చెప్పారు. క్రిమినల్ అభియోగాలు మోపడానికి సరైన సమాచారం లేదని వివరించారు. లబ్ధి పొందారని గానీ లేదా ఐఎంఎస్ డైరెక్టర్‌కు నష్టం కలిగించినట్లు చెప్పకుండా కేవలం సహకరించారంటూ కేసు కొనసాగించడం సరికాదంటూ ఎఫ్‌ఐఆర్‌లో సుజాతపై ఉన్న కేసును కొట్టివేస్తూ తీర్పును వెల్లడించారు.