ప్రశాంతంగా ఉండే బోరబండలోని ప్రాంతాలు భూప్రకంపనలతో ఆందోళనకరంగా మారాయి. గత రాత్రి 8.35 గంటలకు భూమి 15 సెకన్ల పాటు కంపించడంతో ఒక్క సారిగా ఇళ్లనుంచి ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 1.5గా నమోదు అయినట్లు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త నగేశ్ తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురికావడం వల్ల అక్కడికి చేరుకున్న ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మరో వైపు జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గంటల పాటు ప్రజలు రోడ్లపై ఉండటంతో వారికి నచ్చజెప్పి ఇళ్లలోకి పంపిచారు.
భారీ శబ్ధంతో ప్రకంపనలు
డిప్యూటి మేయర్ బాబా ఫాసియుద్దీన్ అక్కడకు చేరుకుని పరిస్థినిన పర్యవేక్షించారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని తెలిపారు. భూకంపం పై సామాజిక మాద్యమాల్లో కొందరు వదంతులు ప్రచారం చేస్తున్నారని... ఇది ఎలాంటి ప్రమాదకరం కాదని ప్రజలకు నచ్చజెప్పారు. స్థానిక దేవాలయాలు, మసీదుల మైకుల్లో ప్రజలకు ఇళ్లలోపలికి వెళ్లాలని సూచించారు. ప్రజలంతా భయం నుంచి తేరుకుని ఇళ్లలోనకి వెళ్లగానే సరిగ్గా 11.25గంటల ప్రాంతంలో మరో సారి భారీ శబ్ధంతో ప్రకంపనలు వచ్చాయి.
బయటకు పరుగులు
మళ్లీ ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. మరి కొంత మంది తమ బ్యాగులను సర్దుకుని నగరంలోని వారి బంధువుల ఇళ్లకు ద్విచక్ర వాహనాలు, ఆటోల్లోన వెళ్లిపోయారు. బోరబండతో పాటు పరిసర ప్రాంతాలైన బోరబండ వీకర్ సెక్షన్, పెద్దమ్మ నగర్, పి అంజయ్యనగర్, వినాయకనగర్, బంజారానగర్, రెహమత్నగర్లోని కొన్ని ప్రాంతాలు, అల్లాపూర్ డివిజన్లోని గాయత్రినగర్, పర్వత్నగర్, తులసినగర్ ప్రాంతాల్లో భూమి కంపిచినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి