ఫీజులపై నెలకొన్న గందరగోళంతో ఎంసెట్ ఇంజినీరింగ్ షెడ్యూలులో మార్పులు చేశారు. ఇవాళ మొదలు కావల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జులై 1కి వాయిదా వేశారు. కళాశాలలు, కోర్సుల ఎంపికకు నాలుగు రోజులు మాత్రమే అవకాశం కల్పించారు. ధ్రువపత్రాల పరిశీలన ఈరోజు నుంచే జరగనుంది. విద్యార్థులు ముందుగా బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారమే ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 24న మొదలైన స్లాట్ బుకింగ్ ప్రక్రియ జులై 1 వరకు కొనసాగనుంది. నేటి నుంచి జులై 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జులై 1 నుంచి జులై 4 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. జులై 6న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.
పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రవ్యాప్తంగా 36 సహాయక కేంద్రాలను సిద్ధం చేశారు. నిన్నటి వరకు 45 వేల 156 మంది విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పరిశీలించనున్నారు. సహాయక కేంద్రాల్లో విద్యార్థులు బయోమెట్రిక్ వివరాలు నమోదు చేస్తారు. ఆధార్ కార్డు, ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి, ఇంటర్ మెమోలు, స్టడీ సర్టిఫికెట్, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది.
రుసుములపై తేలని లెక్క
మరోవైపు ఇంజినీరింగ్ రుసుములపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ ఛైర్మన్ నియామకం జరగక పోవడం వల్ల.. ఇంతవరకు ఫీజులు ఖరారు కాలేదు. రుసుములు ఖరారు చేయకుండా కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేయడం వల్ల కళాశాలల యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లాయి. ఏఎఫ్ఆర్సీ ఛైర్మన్ కొత్త ఫీజులు ఖరారు చేసే వరకు కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులు వసూలు చేసుకోవడానికి హైకోర్టు అనుమతినిచ్చింది.
జులై 1కి వాయిదా
న్యాయస్థానం తీర్పు ప్రతి ఆలస్యంగా అందడం వల్ల నేడు లేదా రేపు ధర్మాసనం ఎదుట సవాల్ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఫీజు ఎంతో తెలిస్తేనే విద్యార్థులు కాలేజీని ఎంచుకోవడానికి వీలుంటుంది. అందుకే వెబ్ ఆప్షన్ల నమోదును జులై 1కి వాయిదా వేశారు.
ఇవీ చూడండి: అనారోగ్యంతో అలనాటి నటి విజయనిర్మల మృతి