ప్రముఖ రచయిత, విమర్శకుడు ద్వాదశి నాగేశ్వర శాస్త్రి సోమవారం అర్థరాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 46ఏళ్లుగా తెలుగు సాహితీ రంగానికి ఎనలేని కృషి చేశారు.
ద్వానా శాస్త్రి ప్రస్థానం..
1950 జూన్ 15న కృష్ణా జిల్లా లింగాల గ్రామంలో జన్మించిన ఆయన.. బీఎస్సీ, ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశారు. ఆయనకు ఒక కుమారుడు , కుమార్తె ఉన్నారు. 1972 నుంచి నేటి వరకు అన్ని రకాల పత్రికల్లో ఆయన వేలాది పుస్తకాలకు సమీక్షలు చేశారు. వందేళ్ల నాటి ఛాయా చిత్రాలు, అరుదైన పుస్తకాలు, అలనాటి విశేష కవితలను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రముఖులుగా ద్వాదశి నాగేశ్వర శాస్త్రి కీర్తి గడించారు. ఆయన రచించిన తెలుగు సాహిత్య చరిత్ర పది ముద్రణలు పొందింది. సాహిత్యంలో పలు ప్రయోగాలు చేసి అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఏకధాటిగా 12 గంటల పాటు తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. శతాధిక రచనలు, అంతకుమించిన పురస్కారాలు అందుకున్న సాహితీ సవ్యసాచి ద్వాదశి నాగేశ్వర శాస్త్రి. బన్సీలాల్ పేటలోని శ్మశాన వాటికలో ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: 'చిన్నోడి చేతులు విరగ్గొట్టారు'